8 గంటల పాటు టార్చర్ పెట్టి భార్యను కొట్టి చంపిన కజక్‌స్థాన్ మాజీ మంత్రి
- సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు
- భర్త సంబంధీకుల రెస్టారెంట్‌లో నుకెనోవా మృతదేహం
- తొలుత బుకాయించి ఆపై నేరాన్ని అంగీకరించిన మాజీ మంత్రి
కజక్‌స్థాన్ మాజీ మంత్రి ఒకరు తన భార్యను తీవ్రంగా కొట్టి హింసించి చంపేశారు. ఇందుకు సంబంధించి ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. 44 ఏళ్ల కౌండ్యక్ బిషిమబేయెవ్ కజక్‌స్థాన్ ఆర్థికమంత్రిగా పనిచేశారు. 31 ఏళ్ల భార్య సాల్టానంట్ నుకెనోవాపై ఆయన దాడిచేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అవి కాస్తా వెలుగులోకి వచ్చి వైరల్ అయ్యాయి. దాదాపు 8 గంటలపాటు ఆయన భార్యపై దాడిచేశారు.
తన భర్త బంధువుల రెస్టారెంట్‌లో నుకేనోవా గతేడాది నవంబరులో విగతజీవిగా కనిపించారు. భర్తే ఆమెను దారుణంగా హింసించి చంపేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తొలుత ఆ ఆరోపణలను ఖండించిన ఆయన బుధవారం జరిగిన కోర్టు విచారణలో నేరాన్ని అంగీకరించారు. అయితే, ఆమెను ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని కోర్టుకు తెలిపారు. మాజీమంత్రిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కోర్టు విచారణ కొనసాగుతోంది.