ఉద్యోగం ఇస్తే రూ. 41 వేలు చెల్లిస్తా.. కంపెనీ చైర్మన్ కు ఓ నిరుద్యోగి మెసేజ్!

  • వారంలో తనను తాను నిరూపించుకోలేకపోతే తొలగించాలని వినతి
  • ఇంటర్వ్యూ పేరుతో కంపెనీ సమయం వృథా చేయాలనుకోవట్లేదని వెల్లడి
  • సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వింగిఫై చైర్మన్ పారస్ చోప్రా
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎవరికీ ఊరికే ఉద్యోగం రాదు.. కంపెనీల ఓనర్లు ఎవరూ ఇంటి తలుపుతట్టి జాబ్ ఇవ్వరు. అందుకే తనకు నచ్చిన కంపెనీలో జాబ్ కోసం ఓ నిరుద్యోగి వినూత్నంగా ప్రయత్నించాడు. తనకు జాబ్ ఇస్తే 500 డాలర్లు (సుమారు రూ. 41,000) ఇస్తానంటూ ఏకంగా కంపెనీ యజమానికే మెసేజ్ పంపాడు! తనను ఆకట్టుకున్న ఆ మెసేజ్ ను కంపెనీ ఓనర్ ‘ఎక్స్’ వేదికగా పంచుకోవడంతో అది కాస్తా వైరల్ గా మారింది.

బెంగళూరుకు చెందిన వింగిఫై సాఫ్ట్ వేర్ కంపెనీ ఫౌండర్, చైర్మన్ పారస్ చోప్రాకు ఇటీవల ఓ నిరుద్యోగి నుంచి అనూహ్య రీతిలో మెసేజ్ వచ్చింది. వింగిఫైలో తనకు ఉద్యోగం ఇస్తే డబ్బు ఇస్తాననేది ఆ సందేశం సారాంశం. ఆ మెసేజ్ ను ఆయన నెటిజన్లతో పంచుకున్నారు.

అందులో ఏమని రాసి ఉందంటే.. ‘నాకు వింగిఫైలో పనిచేయాలని ఉంది. మీకోసం నేనొక ప్రత్యేకమైన ప్రతిపాదన చేస్తున్నా. నన్ను ఉద్యోగంలోకి తీసుకుంటే మీకు 500 డాలర్లు ఇస్తా. కంపెనీలోని ఉత్తమ ఉద్యోగుల్లో ఒకరిగా నన్ను నేను వారం రోజుల్లోగా నిరూపించుకోకపోతే మీరు నన్ను తొలగించండి. ఆ డబ్బు మీ దగ్గరే పెట్టుకోండి. ఇలా చెప్పడం ద్వారా మీ టీం సమయాన్ని వృథా చేయాలనుకోవట్లేదు’ అంటూ ఆ నిరుద్యోగి పేర్కొన్నాడు. మీరు నా ప్రతిపాదనను తిరస్కరిస్తారని ఆశిస్తున్నానంటూ తన మెసేజ్ ను ముగించాడు.

అయితే డబ్బు తీసుకొనే ఉద్దేశం తనకు లేనప్పటికీ ఆ నిరుద్యోగి తెగింపు తనను ఆకట్టుకుందని పారస్ చోప్రా చెప్పారు. ‘కంపెనీ దృష్టిని ఇలా ఆకర్షించాలి’ అంటూ ఆయన పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ వెంటనే వైరల్ గా మారింది. పోస్ట్ చేసిన కాసేపటికే దానికి లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే నెటిజన్లు మాత్రం ఆ నిరుద్యోగి ప్రతిపాదనపై రకరకాలుగా స్పందించారు. ఈ మెసేజ్ అతని ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తోందని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ మరికొందరేమో ఇలాంటి మెసేజ్ లతో హైరింగ్ మేనేజర్లను ఆకర్షించాలనుకోవడం సరికాదని కామెంట్లు పోస్టు చేశారు.




More Telugu News