నేను బస్సు యాత్ర ప్రారంభించాక కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెలు వణుకుతున్నాయ్: కేసీఆర్
- బీఆర్ఎస్ ఎంపీల గెలుపులోనే తెలంగాణ గెలుపు ఉందన్న కేసీఆర్
- కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని వ్యాఖ్య
- బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై తనను నిలువరించారన్న కేసీఆర్
- 48 గంటల పాటు తనపై నిషేధం విధించి గొంతు నొక్కారని ఆగ్రహం
తాను బస్సు యాత్రను ప్రారంభించాక కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెలు వణుకుతున్నాయని... వారు వణికిపోతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రామగుండంలో నిర్వహించిన రోడ్డుషోలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ ఎంపీల గెలుపులోనే తెలంగాణ గెలుపు ఉందన్నారు. అరచేతిలో కాంగ్రెస్ వైకుంఠం చూపించిందన్నారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనన్నారు. మోదీ పాలనలో మత విద్వేషం, దేశం నాశనం తప్ప మరేమీ లేదని ఆరోపించారు. బీజేపీ హయాంలో రూపాయ విలువ తగ్గుతోందన్నారు. డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి విలువ 84 స్థాయికి పడిపోయిందన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై తనను నిలువరించాలని తనపై 48 గంటల ప్రచార నిషేధం విధించారని ఆరోపించారు. 48 గంటల తర్వాత నిషేధించబడిన తన గొంతు మళ్లీ మాట్లాడుతుందని... తాను ఏం చేశానని గొంతును ఆపేశారాని ప్రశ్నించారు. నా గొంతును ఎందుకు నొక్కేశారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల పట్ల ఇష్టారీతిన మాట్లాడినందుకు తాను సిరిసిల్లలో కోపంలో ఓ మాట మాట్లాడానని... అందుకే తన గొంతు నొక్కేస్తారా? అని ప్రశ్నించారు. రూ.370 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని విడుదల చేయాలని అడిగితే నిరోధ్‌లు అమ్ముకోండని కాంగ్రెస్ నేత అన్నారని.. అందుకు తనకు కోపం వచ్చిందన్నారు.
రాజకీయాల్లో మతం గురించి మాట్లాడటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని... కానీ అమిత్ షా తన చేతిలో దేవుడి బొమ్మ పెట్టుకుని మాట్లాడుతుంటే ఈసీకి కనిపించడం లేదన్నారు. ప్రధాని మోదీ హిందూవులు, ముస్లింలంటూ మాట్లాడితే ఈసీకి కనిపించదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏం చేశావని అడిగితే గుడ్లు పీకి గోలీలు ఆడుతాం, పండవెట్టి తొక్కుతామని రేవంత్ రెడ్డి మాట్లాడితే ఈసీకి కనిపించదన్నారు. చేనేత కార్మికుల పక్షాన మాట్లాడితే తనపై నిషేధం విధించారన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు.