1075 మ్యాచ్‌ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి.. మునుపెన్నడూ చూడని రికార్డు నమోదు

  • ఒకే మ్యాచ్‌లో 50 ప్లస్ స్కోర్లు చేసిన ముగ్గురు 23 ఏళ్ల లోపు యువ ఆటగాళ్లు
  • సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్‌లో అర్ధ సెంచరీలతో చెలరేగిన నితీశ్ రెడ్డి, జైస్వాల్, రియాన్ పరాగ్
  • ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా అరుదైన రికార్డు
ఐపీఎల్-2024లో మునుపెన్నడూ చూడని విధంగా అధిక స్కోరింగ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. బ్యాటర్లు చెలరేగుతున్న తీరుకు బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికే అనేక రికార్డ్ బ్రేకింగ్ మ్యాచ్‌లు జరిగాయి. అద్భుతమైన థ్రిల్లింగ్ మ్యాచ్‌లు కూడా జరుగుతున్నాయి. పలు మ్యాచ్‌లు చివరి బంతి వరకు ఉత్కంఠ రేపాయి. గత రాత్రి (గురువారం) సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇలాంటి మ్యాచే జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఒక్క పరుగు వెనుకబడి ఓటమిని చవిచూసింది. ఈ సీజన్‌లో జరిగిన కొన్ని మ్యాచ్‌లతో పోల్చితే ఇదేమీ అంత పెద్ద హైస్కోరింగ్ మ్యాచ్ కానప్పటికీ ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ ఎరుగని రికార్డు నమోదయింది.

ఈ మ్యాచ్‌లో భారత్‌కు చెందిన ముగ్గురు 23 ఏళ్లలోపు ఆటగాళ్లు అర్ధ సెంచరీలకు పైగా స్కోర్లు చేశారు. సన్‌రైజర్స్ తరపున నితీష్ రెడ్డి, రాజస్థాన్ రాయల్స్ తరపున యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ 50 ప్లస్ స్కోర్లు చేశారు. ఈ విధంగా ఇంతకుముందెప్పుడూ ఒకే మ్యాచ్‌లో ముగ్గురు 23 ఏళ్ల లోపు ఆటగాళ్లు యాభైకి పైగా స్కోర్లు చేయలేదని ఐపీఎల్ గణాంకాలు చెబుతున్నాయి. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 1075 మ్యాచ్‌లు జరగగా తొలిసారి ఈ రికార్డు నమోదయింది.

కాగా ఈ మ్యాచ్‌లో నితీశ్ రెడ్డి 42 బంతుల్లో 76 పరుగులు బాదాడు. అందులో ఏకంగా 8 సిక్సర్లు ఉన్నాయి. ఇక రాజస్థాన్ స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ 40 బంతుల్లో 67 పరుగులు కొట్టాడు. ఇక రియాన్ పరాగ్ 49 బంతుల్లో 77 పరుగులు బాదాడు.


More Telugu News