రాహుల్ గాంధీని రాయ్‌బరేలీకి పంపడం వ్యూహంలో భాగం... అందుకే స్మృతి ఇరానీకి గుర్తింపు: జైరాం రమేశ్

  • ఎన్నో చర్చల తర్వాత రాహుల్ గాంధీని పోటీ చేయిస్తున్నట్లు వెల్లడి
  • రాయ్‌బరేలి నుంచి సోనియా మాత్రమే కాదు... ఇందిరాగాంధీ కూడా ప్రాతినిథ్యం వహించారన్న జైరామ్ రమేశ్
  • రాహుల్ గాంధీపై పోటీ చేయడం వల్లే స్మృతి ఇరానీకి గుర్తింపు వచ్చిందని వ్యాఖ్య
రాహుల్ గాంధీని రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దించడం తమ వ్యూహంలో భాగమని, ఇది స్మృతి ఇరానీ, బీజేపీ నేతలకు షాకిచ్చిందని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ  జైరాం రమేశ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారనే అంశంపై చాలామందికి అనేక అభిప్రాయాలు ఉన్నాయని... కానీ గుర్తుంచుకోవాల్సిన విషయమేమంటే అది తమ రాజకీయ చదరంగ వ్యూహమన్నారు. ఎన్నో చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తమ నిర్ణయం బీజేపీని కలవరపాటుకు గురి చేసిందన్నారు.

రాయ్‌బరేలీ నుంచి కేవలం సోనియా గాంధీయే కాదు... గతంలో ఇందిరాగాంధీ కూడా ప్రాతినిథ్యం వహించారన్నారు. అయితే ఇది వారసత్వం కాదని... ఒక బాధ్యత అన్నారు. గాంధీ కుటుంబానికి సంబంధించినంత వరకు, అమేథి, రాయ్‌బరేలీ మాత్రమే వారివి కావని... ఉత్తరం నుండి దక్షిణం వరకు దేశం మొత్తం గాంధీ కుటుంబానికి బలమైన కోట అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ నుంచి మూడుసార్లు, కేరళ నుంచి ఒకసారి ఎంపీగా ఉన్నారని గుర్తు చేశారు. దక్షిణాది నుంచి ప్రధాని మోదీ పోటీ చేసే ధైర్యం ఎందుకు చేయలేకపోయారు? అని ప్రశ్నించారు.

అమేథిలో 2019లో రాహుల్ గాంధీపై పోటీ చేయడం వల్లే స్మృతి ఇరానీకి గుర్తింపు వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆమె రాజకీయ ప్రస్థానం ముగిసిందన్నారు. ఈసారి ఆమె ఓడిపోతారని అభిప్రాయపడ్డారు. ఆమె అర్థంలేని ప్రకటనలు చేయడానికి బదులు నియోజకవర్గం అభివృద్ధి గురించి ఆలోచించాలని హితవు పలికారు. మూతపడిన ఆసుపత్రులు, స్టీల్ ప్లాంట్లు, ఐఐటీలపై దృష్టి పెట్టాలన్నారు. ఇవి సుదీర్ఘ ఎన్నికలని... ప్రణాళికలు ఇంకా మిగిలే ఉన్నాయని... కాస్త వెయిట్ చేద్దామన్నారు.


More Telugu News