ఎవరీ కిశోరీలాల్ శర్మ.. కాంగ్రెస్ ఎందుకు ఎంచుకుంది?

  • దశాబ్దాల తర్వాత అమేథీ నుంచి తొలిసారి గాంధీయేతర వ్యక్తి బరిలోకి
  • గాంధీ కుటుంబంతో కిశోరీలాల్‌కు నాలుగు దశాబ్దాల అనుబంధం
  • 1983లో రాజీవ్‌గాంధీతో కలిసి అమేథీ, రాయ్‌బరేలీ అడుగుపెట్టిన శర్మ
దశాబ్దాల తర్వాత తొలిసారి అమేథీ నుంచి గాంధీయేతర వ్యక్తి ఆ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన పేరు కిశోరీలాల్ శర్మ. అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీని ఆయన ఎదుర్కోబోతున్నారు. దీంతో ఆయన ఎవరన్న ఆసక్తి అందరిలోనూ తలెత్తింది.

కిశోరీలాల్ శర్మ గాంధీ కుటుంబానికి సన్నిహితుడు. నాలుగు దశాబ్దాలుగా గాంధీ కుటుంబంతోనే ఆయన ఉన్నారు. పంజాబ్‌లోని లుధియానాకు చెందిన శర్మ 1983లో రాజీవ్‌గాంధీతో కలిసి రాయ్‌బరేలీ, అమేథీలో అడుగుపెట్టారు. 

1991లో రాజీవ్‌గాంధీ మరణం తర్వాత గాంధీ కుటుంబానికి శర్మ మరింత సన్నిహితంగా మారారు. గాంధీల గైర్హాజరీలో ఆ రెండు నియోజకవర్గాలను పర్యవేక్షిస్తున్నది ఆయనే. ఈ నియోజకవర్గాలను తరచూ సందర్శిస్తూ ఉంటారు. సోనియాగాంధీ తొలిసారి రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత అమేథీ వెళ్లినప్పుడు ఆమె వెంట ఉన్నది ఆయనే. రాహుల్‌గాంధీ కోసం అమేథీ స్థానాన్ని సోనియా వదిలేసి రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసినప్పుడు రాహుల్ వెంట ఉన్నది కూడా ఆయనే. 

రాహుల్‌తో కలిసి శర్మ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఐదో విడతల ఎన్నికల్లో భాగంగా అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు ఈ నెల 20న పోలింగ్ జరగనుంది.


More Telugu News