కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం కేసు నమోదు

  • జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై రెండో కేసు నమోదు చేసిన సిట్
  • పలు మార్లు అత్యాచారం చేసినట్టు ఆరోపణలతో కేసు నమోదు
  • అందుకు ముందు ప్రజ్వల్, అతడి తండ్రి రేవణ్ణపై కూడా కేసు
  • ప్రస్తుతం ప్రజ్వల్ జర్మనీలో ఉన్నట్టు అనుమానాలు, లుకౌట్ నోటీసులు జారీ
లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎంపీ రేవణ్ణపై కర్ణాటక పోలీసులు తాజాగా అత్యాచారం కేసు నమోదు చేశారు. ఎంపీపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం నమోదు చేసిన రెండో కేసు ఇది. ఐపీసీ సెక్షన్ 376(బీ)(ఎన్) (పలు మార్లు అత్యాచారం), 506 (నేరపూరిత బెదిరింపులు), 354(ఏ)(2), 354(బీ)(బలవంతంగా దుస్తులు తొలగించడం), సెక్షన్ 354(సీ)(నగ్న చిత్రాల అప్‌లోడ్), ఐటీ చట్టం కింద కేసు ఫైల్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్‌లో ఒకే ఒక నిందితుడిగా రేవణ్ణను చేర్చారు.  జేడీఎస్ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ అన్న విషయం తెలిసిందే. 

కాగా, ఈ ఆరోపణలపై సిట్ గతంలో ప్రజ్వల్‌తో పాటు అతడి తండ్రి, మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు, బెదిరింపులు, వెంటపడటం, మహిళ మర్యాదకు భంగం వాటిల్లేలా చేయడం తదితర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. వారి ఇంట్లో సహాయకురాలిగా ఉన్న మహిళ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. 

హసన్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన కొన్ని అసభ్యకర చిత్రాలు వెలుగులోకి రావడంతో లైగింక దాడి ఆరోపణలు మొదలయ్యాయి. కానీ, ఆ వీడియోలన్నీ మార్ఫింగ్ చేసినవని ఎంపీ పేర్కొన్నారు. ఈ విషయమై తన పోలింగ్ ఏజెంట్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కాగా, ప్రజ్వల్‌పై గ్లోబల్ లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్టు సిట్ ప్రభుత్వానికి తెలిపింది. లైంగిక ఆరోపణలు వెలుగు చూడగానే దేశం వీడిన ప్రజ్వల్ ప్రస్తుతం జర్మనీలో ఉన్నట్టు సమాచారం. గురువారమే ఆయన సిట్ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.


More Telugu News