20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా, ఏసీ కొనాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు: బెంగళూరు మహిళ

  • బెంగళూరులో అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత
  • వేడికి అల్లాడుతున్న ప్రజలు, పెరిగిన ఏసీల వినియోగం
  • ఏసీ కొనాల్సి వస్తుందని 20 ఏళ్లల్లో ఎప్పుడూ అనుకోలేదంటూ నెట్టింట మహిళ పోస్టు
  • మహిళ పోస్టుకు నెట్టింట భారీ స్పందన, మహిళ అభిప్రాయంతో ఏకీభవిస్తున్న వైనం
ఒకప్పుడు బెంగళూరు అంటే గుర్తొచ్చేది ఆహ్లాదకరమైన వాతావరణం. నేడు ఈ నగరం నీటి కొరత, అధిక ఉష్ణోగ్రతలకు పర్యాయపదంగా మారింది. ఒకప్పుడు బెంగళూరు వాసులకు కేవలం ఫ్యాన్‌ ఉంటే సరిపోయేది. నేడు ఏసీ తప్పనిసరిగా మారిన దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిపై స్థానిక మహిళ నెట్టింట పంచుకున్న పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. 

‘‘20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా. నాకు ఏసీ అవసరం పడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఒకప్పుడు బెంగళూరు గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఇక్కడి వారు ఆహ్లాదకర వాతావరణం గురించి చెప్పి సమర్థించుకునేవారు. ఇకపై ఆ ఆటలు చెల్లవు. రాజస్థాన్‌లో ఉంటున్నట్టు ఉంది. ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వేడి తట్టుకోలేకపోతున్నా’’ అని మిస్ అమ్మన్న రాుసుకొచ్చింది. తన బెడ్‌రూంలో ఇన్‌స్టాల్ చేసిన ఏసీ ఫొటోను కూడా పంచుకుంది. 

అనేక మంది బెంగళూరు వాసులు ఆమె పోస్టుతో ఏకీభవించారు. తన కూలర్‌ను ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ వాడుతున్నానని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. 1970ల్లో బెంగళూరు స్వర్గంలా ఉండేదని ఇప్పుడు ఓ నరకంలా ఉందని మరో వ్యక్తి కామెంట్ చేశారు. ఇదంతా గ్లోబల్ వార్మింగ్ ప్రభావమని మరొకరు అన్నారు. గత నాలుగు దశాబ్దాల్లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత దాదాపు 1 డిగ్రీ సెల్సీయస్ మేర పెరిగిందని అన్నారు. 1850ల తరువాత అత్యధిక ఉష్ణోగ్రత 2023లో నమోదైందని కొందరు చెప్పారు.


More Telugu News