రాజ‌స్థాన్‌కు షాక్‌.. ఉత్కంఠ పోరులో ఎస్ఆర్‌హెచ్ విజ‌యం..!

  • ఉప్ప‌ల్ వేదిక‌గా రాజస్థాన్‌ రాయల్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మ్యాచ్‌
  • హైదరాబాద్ స్కోర్‌: 201/3 (20 ఓవర్లు), రాజ‌స్థాన్ స్కోర్‌: 200/7 (20 ఓవర్లు)
  • ఒక్క ప‌రుగు తేడాతో స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం
  • రియాన్‌ పరాగ్ (77), య‌శ‌స్వి జైస్వాల్ (67) అర్ధ శ‌త‌కాలు వృథా
  • రాణించిన తెలుగు ప్లేయ‌ర్‌ నితీశ్ రెడ్డి (42 బంతుల్లో 76 ప‌రుగులు: 8 సిక్స‌ర్లు, 3 బౌండ‌రీలు)
ఉప్ప‌ల్ వేదిక‌గా రాజస్థాన్‌ రాయల్స్ (ఆర్ఆర్‌) తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) విజయం సాధించింది. రాజస్థాన్‌పై ఒక్క పరుగు తేడాతో గెలిచింది. 202 పరుగుల భారీ ల‌క్ష్య‌ఛేద‌నతో బరిలోకి దిగిన రాజస్థాన్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్ల‌లో 200 పరుగులకే పరిమితమైంది. చివరలో పొవెల్‌ రాజస్థాన్‌ను విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ.. చివరి బంతికి ఎల్బీడబ్ల్యూగా ఔట్‌ కావడంతో ప‌రాజ‌యం తప్పలేదు. రియాన్‌ పరాగ్ (77), య‌శ‌స్వి జైస్వాల్ (67) అర్ధ శ‌త‌కాలు వృథా అయ్యాయి. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ 3 వికెట్లు తీయ‌గా.. ప్యాట్‌ క‌మిన్స్, న‌ట‌రాజ‌న్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. 

అంత‌కుముందు టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 3 వికెట్లు కోల్పోయి 201 ప‌రుగులు చేసింది. హైదరాబాద్‌ ఆటగాళ్లను ఆర్ఆర్‌ బౌలర్లు ఆది నుంచి కట్టడి చేశారు. దీంతో పవర్‌ ప్లేలో 2 వికెట్ల నష్టానికి కేవ‌లం 37 పరుగులు మాత్ర‌మే చేసింది. ఐదో ఓవర్‌లో అవేశ్‌ ఖాన్‌ వేసిన తొలి బంతికి షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి ఓపెన‌ర్‌ అభిషేక్ శ‌ర్మ (12) అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అన్‌మోల్‌ప్రీత్‌(5) తొలి బంతికే ఫోర్‌ బాదాడు. కానీ ఆరో ఓవర్‌లో సందీప్‌ శర్మ వేసిన బంతికి జైస్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

రాజస్థాన్ రాయ‌ల్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో రెండు కీలక వికెట్లను కోల్పోయిన ఎస్ఆర్‌హెచ్‌ కాసేపు నిలకడగా ఆడింది. ఆ త‌ర్వాత ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌ నుంచి ట్రావిస్‌ హెడ్‌ బ్యాట్ ఝుళిపించాడు. అతనికి తెలుగు ఆట‌గాడు నితీశ్‌రెడ్డి జత కలిశాడు. దీంతో ఇద్దరూ కలిసి చెరో అర్ధ శతకంతో జట్టుకు భారీ స్కోర్‌ అందించారు. ఈ క్ర‌మంలో అవేశ్‌ ఖాన్‌ వేసిన 15వ ఓవర్‌లో హెడ్ (58)  క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

ఇక హెడ్‌ ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన క్లాసెస్ (42) కూడా దూకుడుగా ఆడాడు. నితీశ్ రెడ్డి 42 బంతుల్లో 8 సిక్స‌ర్లు, 3 బౌండ‌రీల సాయంతో అజేయంగా 76 ప‌రుగులు చేశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోర్ 200 దాటింది. రాజస్థాన్ రాయ‌ల్స్‌కు 202 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. 

ఇక 202 ప‌రుగుల భారీ లక్ష్య‌ఛేద‌న‌తో బరిలోకి దిగిన ఆర్ఆర్‌కు ఆరంభంలోనే భారీ షాక్‌ తగిలింది. తొలి ఓవర్‌లోనే రెండు కీలక వికెట్లు పారేసుకుంది. భువనేశ్వర్‌ వేసిన మొదటి ఓవర్‌లో రెండో బంతిని ఎదుర్కొన్న జాస్‌ బట్లర్ గోల్డెన్ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ కూడా ప‌రుగుల ఖాతా తెర‌వ‌కుండానే తాను ఎదుర్కొన్న మూడో బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. శాంస‌న్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రియాన్‌ పరాగ్‌ (77), య‌శ‌స్వి జైస్వాల్‌(67) ద్వ‌యం హైద‌రాబాద్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించింది. ప్రారంభంలో ఈ ఇద్ద‌రు ఇచ్చిన క్యాచ్‌ల‌ను ఎస్ఆర్‌హెచ్ ప్లేయ‌ర్లు నేల‌పాలు చేశారు. అలా త‌మ‌కు ల‌భించిన అవ‌కాశాల‌ను ఈ జోడి స‌ద్వినియోగం చేసుకుంది. 

ఆ త‌ర్వాత‌ పరాగ్‌, జైస్వాల్‌ ఇద్దరూ చెరో హాఫ్‌ సెంచరీతో చెలరేగి ఆడారు. కానీ నటరాజన్‌ బౌలింగ్‌లో 14వ ఓవర్‌లో మూడో బంతికి జైస్వాల్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో ఈ ద్వ‌యం 133 ప‌రుగుల భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. అనంత‌రం ప్యాట్‌ కమిన్స్‌ వేసిన 16వ ఓవర్‌లో పరాగ్‌ పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత పరుగుల వేటలో రాజస్థాన్ రాయ‌ల్స్ వెనుకబడింది. పరాగ్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన హెట్‌మెయిర్‌ (13), ధ్రువ్‌ జురెల్‌ (1) వెంట‌వెంట‌నే వికెట్లు పారేసుకున్నారు. 

చివరలో పొవెల్‌ రాణించినప్పటికీ లాభం లేకుండా పోయింది. భువ‌నేశ్వ‌ర్  వేసిన ఆఖ‌రి ఓవ‌ర్‌ చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా.. పొవెల్‌ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో సన్‌రైజర్స్ హైద‌రాబాద్‌ విజయం సాధించింది. మూడు వికెట్లు తీసిన భువ‌నేశ్వ‌ర్‌కు 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు ల‌భించింది.


More Telugu News