ఏపీలో పోలింగ్ సమయం పెంచండి... ఈసీకి లేఖ రాసిన కనకమేడల

  • ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికలు
  • ఒకే రోజున అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు
  • ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
  • ఎండల తీవ్రత దృష్ట్యా 6 గంటల వరకు పోలింగ్ జరపాలన్న కనకమేడల
ఏపీలో ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, పోలింగ్ సమయం పెంచాలంటూ టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. 

రాష్ట్రంలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ సమయాన్ని మరో గంట పెంచాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. సాయంత్రం 5 తర్వాత మరో గంట పాటు పోలింగ్ కొనసాగేలా అనుమతించాలని తన లేఖలో కోరారు. 

కాగా, తెలంగాణలో పలు పార్టీల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ఈసీ పోలింగ్ సమయాన్ని గంట పెంచిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కూడా మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. 

తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా... 12 లోక్ సభ స్థానాల్లో పూర్తిగా, మిగిలిన 5 లోక్ సభ స్థానాల పరిధిలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే ఈ గంట సమయం పెంపు వర్తిస్తుంది.


More Telugu News