రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లపై రఘునంద్ రావు తీవ్ర విమర్శలు

  • బతుకమ్మ ఆడితే పైసలు రావడం లేదని కవిత ఢిల్లీకి పోయి సారా దుకాణం తెరిచిందని ఎద్దేవా
  • రేవంత్ రెడ్డిని నమ్మి గెలిపిస్తే హామీలపై మాట తప్పారని విమర్శ
  • మోదీ హయాంలో దేశం పదేళ్లుగా హాయిగా ఉందన్న రఘునందన్ రావు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లపై మెదక్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం కుక్నూరుపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ... కేసీఆర్‌ను టీవీలో చూసి సంతోషపడాల్సిందే తప్ప ఇంతవరకు ఆయన మన వద్దకు వచ్చింది లేదన్నారు. బతుకమ్మ ఆడితే పైసలు రావడం లేదని చెల్లె ఢిల్లీకి పోయి సారా దుకాణం తెరిచి దందా మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. అందుకే ఆమె ఇప్పుడు జైల్లో ఉన్నారన్నారు.

సూట్‌కేసుల ఆశతో వెంకట్రామిరెడ్డి మాజీ మంత్రి హరీశ్ రావు వెంట తిరుగుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నమ్మి గెలిపించుకుంటే రూ.4వేల పెన్షన్ రావడం లేదని, మహిళలకు రూ.2500 రావడం లేదని మండిపడ్డారు. కేసీఆర్‌పై కోపంతో చెయ్యి గుర్తుకు ఓటేస్తే తల మీద మొండి చెయ్యి పెట్టారన్నారు. హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. పదేళ్లుగా మోదీ హయాంలో దేశం హాయిగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాంబుల వర్షం కురుస్తుందని హెచ్చరించారు.


More Telugu News