మహిళా కమిషన్‌లో 223 మంది ఉద్యోగులను తొలగించిన ఢిల్లీ ఎల్జీ... కమిషన్ మాజీ చైర్ పర్సన్‌ తీవ్ర ఆగ్రహం

  • నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారని తొలగించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్
  • కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగిస్తే మహిళా కమిషన్ మూసివేసే పరిస్థితి వస్తుందని స్వాతి మాలివాల్ ఆందోళన
  • తొమ్మిదేళ్లు మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా ఉన్న స్వాతి మాలివాల్
  • ఆ తర్వాత ఏఏపీ తరఫున రాజ్యసభకు వెళ్లిన స్వాతి మాలివాల్
  • నాటి నుంచి ఖాళీగా ఉన్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి
మహిళా కమిషన్‌లోని 223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా ఉన్న సమయంలో నిబంధనలను ఉల్లంఘించి ఈ నియామకాలు చేపట్టారని గవర్నర్ పేర్కొన్నారు.

కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగిస్తే మహిళా కమిషన్ మూసివేసే పరిస్థితి వస్తుందని లెఫ్టినెంట్ గవర్నర్ ఉత్తర్వులను ఉద్దేశించి స్వాతి మాలివాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్యానెల్‌లో 90 మంది సిబ్బంది ఉన్నారని, ఇందులో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పారు. మిగిలిన వారు మూడు నెలల కాంట్రాక్టుపై ఉన్నట్లు తెలిపారు. 'ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ మహిళా కమిషన్ ఏర్పాటు వెనుక ఎంతోమంది రక్తం, చెమట చిందించారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను జైల్లో పెట్టినా సరే... మహిళా కమిషన్‌ను మూసేసే పరిస్థితి రానివ్వనన్నారు.

మహిళా కమిషన్ చట్టం ప్రకారం ప్యానెల్‌లో 40 మంది ఉద్యోగులు మాత్రమే ఉండాలని, కానీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లేకుండా 223 కొత్త పోస్టులను సృష్టించారని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించుకునే అధికారం కమిషన్‌కు లేదని అందులో పేర్కొన్నారు. 2017 ఫిబ్రవరిలో నాటి లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పించిన విచారణ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.

ఈ నియామకాలకు ముందు అవసరమైన పోస్టుల కోసం కసరత్తు జరగలేదని, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా చేసిన ఈ నియామకాల వల్ల ప్రభుత్వానికి అదనపు ఆర్థిక భారమని పేర్కొంది. నిర్దేశించిన విధానాల ప్రకారం ఈ విధానాలు జరగలేదని లెఫ్టినెంట్ గవర్నర్ పేర్కొన్నారు. ఢిల్లీ మహిళా కమిషన్ సిబ్బందికి వేతనం, జీతభత్యాల పెంపు కూడా మార్గదర్శకాల ప్రకారం లేదని తప్పుబట్టారు.

స్వాతి మాలివాల్ ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. అంతకుముందు తొమ్మిదేళ్లు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా ఉన్నారు. నాటి నుంచి ఈ పదవి ఖాళీగానే ఉంది. నియామకాలకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని మాలివాల్‌కు పలుమార్లు సూచించినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


More Telugu News