మహిళలను కించపరిచేలా జగన్ వ్యాఖ్యలు చేశారంటూ ఈసీకి టీడీపీ ఫిర్యాదు

  • ఏపీ సీఎం ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపణ
  • జగన్ ఎన్నికల ప్రచారంపై బ్యాన్ విధించాలని డిమాండ్
  • అబద్ధాలతో ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారని మండిపాటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ప్రతిపక్ష అభ్యర్థుల వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా జగన్ పై తక్షణం బ్యాన్ విధించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ఏపీ ఎలక్షన్ కమిషనర్ కు జగన్ పై ఫిర్యాదు చేసినట్లు మీడియాకు వివరించారు.

ఎన్నికల ప్రచారంలో అలవోకగా అబద్ధాలు చెబుతూ ప్రతిపక్షాలపై జగన్ బురద జల్లుతున్నారని ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. రాష్ట్రంలోని మహిళలను కించపరిచేలా జగన్ మాట్లాడుతున్నారని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తన స్థాయి మరిచి చంద్రబాబు, పవన్‌ లపై తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు. ఇది ఎన్నికల కోడ్ కు విరుద్ధమని, కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన జగన్ ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ పై ఎన్నికల ప్రచారం చేయకుండా ఈసీ 48 గంటల పాటు బ్యాన్ విధించినట్లు ఏపీ సీఎంపైనా చర్యలు తీసుకోవాలని ప్రత్తిపాటి పుల్లారావు కోరారు.


More Telugu News