వందే భారత్ వర్సెస్ వందే మెట్రో.. తేడాలు ఏమిటి?

  • ఇప్పటికే పరుగులు తీస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు
  • త్వరలో పట్టాలెక్కనున్న వందే మెట్రోలు
  • దూరం, ప్రయాణ వేగం, సీట్ల సంఖ్యలో రెండు రైళ్ల మధ్య పోలికే లేదు
రైల్వే శాఖ ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు సూపర్ హిట్ అయ్యాయి. ప్రధాన నగరాల మధ్య పరుగులు తీయడంలో గేమ్ ఛేంజర్ లా మారాయి. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. వీటిలో ప్రయాణించేందుకు ప్రజలు పోటీపడుతున్నారు. ఈ రైళ్లన్నీ ఎప్పుడూ 100 శాతం ఆక్యుపెన్సీతోనే పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 82 వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తుండగా త్వరలో మరికొన్ని పట్టాలు ఎక్కనున్నాయి. ట్రైన్ 18 పేరుతో 2019లో వీటిని రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. 

వందే భారత్ లు విజయవంతం కావడంతో అదే జోష్ లో రైల్వే శాఖ త్వరలో వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టనుంది. జులైలో కొన్ని రూట్లలో ప్రయోగాత్మకంగా నడపనుంది. కలర్ లో తేడా తప్ప ఇవి చూసేందుకు అచ్చం వందే భారత్ ల లాగానే ఉన్నాయి. మరి ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు ఏమిటి?

ప్రయాణ దూరంలో తేడా! 
వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు దూర ప్రాంతాల మధ్య పరుగులు తీస్తున్నాయి. సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలోని నగరాలకు ప్రయాణిస్తున్నాయి. కానీ వందే మెట్రోలు తక్కువ దూరానికి ఉద్దేశించినవి. అంటే సుమారు 100 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాల మధ్య షటిల్ సర్వీస్ లాగా రాకపోకలు సాగించనున్నాయి. అంటే ఇవి మినీ వందే భారత్ లు అన్నమాట. సమీప పట్టణాల్లో పనిచేసే ఉద్యోగులు, చదువుకొనే విద్యార్థులకు వందే మెట్రోల వల్ల ఎక్కువగా లాభం జరగనుంది. దేశంలో సబర్బన్ రైలు ప్రయాణ అనుభూతిని మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ వీటిని ప్రవేశపెడుతోంది. 124 నగరాలు, పట్టణాల్లో వందే మెట్రోలను ప్రారంభించనుంది.

కోచ్ ల సంఖ్య
వందే భారత్ ల లాగానే వందే మెట్రోలలో కూడా కనీసం 12 కోచ్ లు ఉంటాయి. ప్రయాణికుల రద్దీనిబట్టి 16 కోచ్ ల దాకా పెంచనున్నారు. అయితే సీట్ల సంఖ్యలో మాత్రం తేడా ఉండనుంది. వందే భారత్ లలో అందరికీ సౌకర్యవంతమైన సీటింగ్ సదుపాయం ఉంటోంది. కానీ వందే మెట్రోలలో కేవలం 100 మంది కూర్చొనేందుకే సీట్లు ఉండనున్నాయి. మరో 180 మంది ప్రయాణికులు నిలబడేందుకు వీటిలో చోటు వుంటుంది. 

వేగంలోనూ తేడా 
వందే భారత్ లు చాలా వేగవంతమైనవి. గంటకు గరిష్ఠంగా 183 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలవు. కానీ వందే మెట్రోలు కొంత తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నాయి. గంటకు 130 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకే వెళ్లగలవు.

ఫ్రీక్వెన్సీ
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు రోజుకు ఒకటి లేదా రెండు ట్రిప్పులు నడుస్తున్నాయి. కానీ వందే మెట్రోలు షటిల్ సర్వీస్ లాగా రోజుకు నాలుగు లేదా ఐదు ట్రిప్పులు వేయగలవు.

వందే మెట్రోల కీలక రూట్లు ఇవే..
తిరుపతి–చెన్నై
ఢిల్లీ–రేవారి
ఆగ్రా–మథుర
లక్నో–కాన్పూర్
భువనేశ్వర్–బాలాసోర్


More Telugu News