సంజూ శాంసన్ కు పిచ్ క్యురేటర్ బెస్ట్ విషెస్.. ఇదిగో వీడియో

  • నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ ప్రాక్టీస్
  • పిచ్ స్వభావం గురించి క్యురేటర్ ను అడిగి తెలుసుకున్న కెప్టెన్ శాంసన్
  • అతనికి టీ2‌‌‌‌0 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కడంపై క్యురేటర్ హర్షం
  • పెద్దవాడిగా తన ఆశీస్సులు ఉంటాయని వెల్లడి.. జట్టు కచ్చితంగా కప్ కొడుతుందని జోస్యం
టీ20 వరల్డ్ కప్ జట్టులో సంజూ శాంసన్ కు చోటు లభించడంతో అతని అభిమానులు, శ్రేయోభిలాషులు సంబరపడుతున్నారు. అలాంటి వారిలో ఓ పిచ్ క్యురేటర్ కూడా ఉన్నారు.

సన్ రైజర్స్ హైదరాబాద్ తో  మ్యాచ్ కోసం రాజస్తాన్ రాయల్స్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ముమ్మర సాధన చేస్తోంది. గురువారం ఇరు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ ఐపీఎల్ 2024లో సరిగ్గా 50వ మ్యాచ్ కావడం విశేషం. 

రాజస్తాన్ రాయల్స్ జట్టు ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా కెప్టెన్ సంజూ శాంసన్.. పిచ్ క్యురేటర్ ను కలిశాడు. పిచ్ స్వభావం గురించి అడిగి తెలుసుకున్నాడు. ఈ సందర్భంగా టీ20 జట్టులో చోటు పొందినందుకు శాంసన్ కు క్యురేటర్ శుభాకాంక్షలు తెలియజేశాడు. అమెరికా, కరీబియన్ లలో జరగనున్న టీ20 మ్యాచ్ లలో సత్తా చాటాలని ఆకాంక్షించాడు.

‘నీకు జట్టులో చోటు లభించినందుకు చాలా సంతోషిస్తున్నా. పెద్దవాడిగా నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. దేశం కోసం ఆడి బ్యాట్ తో సమాధానం చెప్పు. మీరంతా (జట్టులోని సభ్యులు) బిగ్ బ్యాంగ్ తో తిరిగొస్తారు. ట్రోఫీ గెలుచుకుంటారు. నువ్వు కచ్చితంగా బాగా ఆడతావు’ అని క్యురేటర్ చెప్పాడు. ఆపై శాంసన్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. అనంతరం శాంసన్ గ్రౌండ్ సిబ్బంది భుజంపై చెయ్యి వేసి ఆత్మీయంగా ఫొటోలు దిగాడు. 

ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ జట్టు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ లో ఓ మలయాళం పాటను ప్లే చేసింది. ఇది వెంటనే వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన క్రికెట్ లవర్స్ సంజూ శాంసన్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. అతను టీ20 వరల్డ్ కప్ తో కచ్చితంగా రాణిస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

అయితే మరికొందరు ఫ్యాన్స్ మాత్రం శాంసన్ కు తుది జట్టులో చోటు దక్కదేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారు ప్రమాదం నుంచి కోలుకున్న మరో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ కు సింపతీ వర్కౌట్ అవుతుందేమోనని సందేహిస్తున్నారు. టీం మేనేజ్ మెంట్ అతన్ని తుది జట్టులోకి తీసుకొని శాంసన్ ను రిజర్వ్ ఆటగాడిగానే బెంచ్ పై కూర్చోబెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


More Telugu News