చంద్రబాబుకు ఓటు వేయడానికి అమెరికా నుండి గుంటూరుకు ముస్లిం యువతి

  • టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో 'విదేశీ విద్యా ప‌థ‌కం' ద్వారా ల‌బ్ధి పొందిన మ‌హ్మ‌ద్ ప‌ర్వీన్
  • టీడీపీ స‌ర్కార్ అందించిన రూ. 15 లక్షల ఆర్థిక సాయంతో అమెరికాలో ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించిన వైనం
  • ప్ర‌స్తుతం అక్క‌డే ఉద్యోగం చేస్తున్న గుంటూరు యువ‌తి
  • తానీ స్థాయికి రావ‌డానికి కార‌ణ‌మైన చంద్ర‌బాబు రుణం తీర్చుకోవ‌డానికే స్వ‌దేశానికి వ‌చ్చిన‌ట్టు వెల్ల‌డి  
టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో విదేశీ విద్యా ప‌థ‌కం ద్వారా ల‌బ్ధి పొంది అమెరికాలో ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించి అక్క‌డే ఉద్యోగం కూడా సంపాదించిన ఓ ముస్లిం యువ‌తి ఆ రుణం తీర్చుకునేందుకు స్వ‌దేశానికి తిరిగొచ్చారు. ఈ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నేతృత్వంలోని టీడీపీకి ఓటు వేయాల‌నే సంక‌ల్పంతో రెండు రోజుల క్రితం స్వ‌స్థ‌లం గుంటూరు చేరుకున్నారు. 

న‌గ‌రానికి చెందిన చిరుద్యోగి చాంద్‌బాషా కుమార్తె మ‌హ్మ‌ద్ ప‌ర్వీన్ 2019లో అమెరికాలో ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించాల‌ని అనుకున్నారు. కానీ, అంత స్తోమ‌త లేదు. కుటుంబ ఆర్థిక ప‌రిస్థితులు అంతంత‌మాత్ర‌మే. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు తీసుకొచ్చిన విదేశీ విద్యా ప‌థ‌కం గురించి తెలుసుకుని ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. దాంతో టీడీపీ స‌ర్కార్ ఆమెకు రూ. 15ల‌క్ష‌లు మంజూరు చేసింది. 

ఆ ఆర్థిక సాయంతో ఆమె అమెరికాలోని నార్త్ వెస్ట్ మిస్సోరి వ‌ర్సిటీలో ఉన్న‌త విద్య అభ్య‌సించారు. ఆ త‌ర్వాత అక్క‌డే ఉద్యోగం సంపాదించారు. ఈ ఎన్నిక‌ల్లో త‌న ఓటు హ‌క్కును వినియోగించుకుని తానీ స్థాయికి రావ‌డానికి కార‌ణ‌మైన చంద్ర‌బాబు రుణం తీర్చుకోవాల‌నే ఉద్దేశంతో ఆమె గుంటూరుకు వ‌చ్చారు. 

ఈ విష‌యాన్ని ఆమె మంగ‌ళ‌వారం గుంటూరు ప‌శ్చిమ టీడీపీ అభ్య‌ర్థి మాధ‌వికి తెలియజేశారు. 'నా లాంటి పేద విద్యార్థుల బాగు కోసం సైకిల్ గుర్తుకే ఓటు వేసి చంద్ర‌న్న‌ను గెలిపించుకుంటాం' అని ప‌ర్వీన్ చెప్పారు. ఇక ఈ విష‌యం తెలుసుకున్న టీడీపీ అధినేత బుధ‌వారం గుంటూరు ప‌ర్య‌ట‌న‌లో ఆమెను పిలిపించుకొని ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించారు.


More Telugu News