సీఎస్‌కేపై పంజాబ్ సునాయాస విజ‌యం.. ముంబై రికార్డు స‌మం!

  • చెపాక్ మైదానంలో సీఎస్‌కే వ‌ర్సెస్ పీబీఎస్‌కే మ్యాచ్‌
  • చెన్నైను 7 వికెట్ల తేడాతో ఓడించిన పంజాబ్‌
  • రాణించిన బెయిర్ స్టో (46), రోస్సో (43) 
  • హ‌ర్‌ప్రీత్ బ్రార్‌కు 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు
  • చెన్నైను వ‌రుస‌గా ఐదు సార్లు ఓడించిన జ‌ట్టుగా ముంబై త‌ర్వాత‌ పీబీఎస్‌కే 
  • కోహ్లీని దాటేసిన రుతురాజ్ గైక్వాడ్‌  
చెపాక్ స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) తో జ‌రిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌) సునాయాస విజ‌యం సాధించింది. 163 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంజాబ్ 7 వికెట్ల తేడాతో జ‌య‌కేత‌నం ఎగురువేసింది. పీబీకేఎస్ బ్యాట‌ర్ల‌లో బెయిర్ స్టో (46), రోస్సో (43) రాణించారు. కెప్టెన్ శామ్ క‌ర‌న్ 26, శశాంక్ సింగ్ 25 చివ‌రి వ‌ర‌కు క్రీజులో నిల‌బ‌డి జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చారు. చెన్నై బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్‌, రిచ‌ర్డ్‌, శివం దూబే చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. 

అంత‌కుముందు టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 162 ప‌రుగులు చేసింది. చెన్నై బ్యాట‌ర్ల‌లో మ‌రోసారి రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచ‌రీ (62) తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మ‌రో ఓపెన‌ర్ అజింక్య ర‌హానే 29, స‌మీర్ రిజ్వీ 21 ప‌రుగులు చేయ‌గా, మిగ‌తా బ్యాట‌ర్లు ఘోరంగా విఫ‌లం అయ్యారు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఎంపికయిన శివం దూబే ఈ మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఎప్ప‌టిలానే చివ‌ర్లో బ్యాటింగ్‌కి వచ్చిన మాజీ సారధి మ‌హేంద్ర సింగ్ ధోనీ (14) కూడా మెరుపులు మెరిపించ‌లేక‌పోవ‌డంతో అభిమానులు కొంత నిరాశ‌కు గుర‌య్యారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో హ‌ర్‌ప్రీత్ బ్రార్‌, రాహుల్ చాహ‌ర్‌ త‌లో రెండు వికెట్లు.. అర్ష‌దీప్ సింగ్‌, ర‌బాడ చెరో వికెట్‌ తీశారు. 

అనంత‌రం 163 ప‌రుగుల స్వ‌ల్ప లక్ష్యంతో బ‌రిలోకి దిగిన పంజాబ్ అల‌వోక‌గా టార్గెట్‌ను అందుకుంది. జ‌ట్టు స్కోర్ 19 ప‌రుగుల వ‌ద్ద ఓపెన‌ర్ ప్ర‌భ్‌సిమ్ర‌న్ సింగ్ (13) వికెట్‌ను త్వ‌ర‌గా కోల్పోయినా.. ఆ త‌ర్వాత బెయిర్ స్టో (46), రోస్సో (43) ద్వ‌యం పీబీఎస్‌కే ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్దారు. మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఆడారు. ఈ జోడి 64 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించింది. ఇటీవ‌లే సెంచ‌రీతో క‌దం తొక్కిన బెయిర్ స్టో ఈ మ్యాచ్‌లో మ‌రోసారి చ‌క్క‌టి ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతుల్లో 7 బౌండ‌రీలు, ఒక సిక్స‌ర్ సాయంతో 46 ప‌రుగులు చేసి ఆక‌ట్టుకున్నాడు. 

అత‌నికి తోడుగా రోస్సో 43 ప‌రుగులు చేశాడు. జ‌ట్టు స్కోర్ 83 ప‌రుగుల వ‌ద్ద బెయిర్ స్టో పెవిలియ‌న్ చేరాడు. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన శ‌శాంక్ సింగ్ తో క‌లిసి రోస్సో ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్ర‌మంలో రోస్సోను శార్దూల్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంత‌రం బ్యాటింగ్‌కి దిగిన సార‌ధి శామ్ క‌ర‌న్ 26.. శ‌శాంక్‌తో క‌లిసి జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. త‌న 4 ఓవ‌ర‌ల్లో కోటాలో కేవ‌లం 17 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి రెండు వికెట్లు ప‌డ‌గొట్టిన హ‌ర్‌ప్రీత్ బ్రార్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

ముంబై రికార్డు స‌మం చేసిన పంజాబ్‌ 
ఈ విజ‌యంతో సీఎస్‌కేపై పీబీఎస్‌కే అరుదైన రికార్డు న‌మోదు చేసింది. ఆ జ‌ట్టును వ‌రుస‌గా ఐదు సార్లు ఓడించింది. దీంతో ముంబై ఇండియ‌న్స్ త‌ర్వాత ఈ ఫీట్ సాధించిన జ‌ట్టుగా నిలిచింది. అలాగే చెపాక్ మైదానంలో చెన్నైపై అత్య‌ధిక విజ‌యాలు సాధించిన జ‌ట్టుగా ముంబై త‌ర్వాతి స్థానంలో పంజాబ్ నిలిచింది. ఎంఐ ఐదు సార్లు చెపాక్‌లో సీఎస్‌కేపై విక్ట‌రీ న‌మోదు చేయ‌గా, పంజాబ్ నాలుగు సార్లు గెలిచింది. 

విరాట్ కోహ్లీని దాటేసిన రుతురాజ్ గైక్వాడ్‌
ఐపీఎల్‌-2024లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా సీఎస్‌కే సార‌ధి రుతురాజ్ గైక్వాడ్ (509) కొన‌సాగుతున్నాడు. పంజాబ్‌తో మ్యాచులో 62 ర‌న్స్ కొట్టిన గైక్వాడ్.. ఇప్ప‌టివ‌ర‌కు మొద‌టి స్థానంలో ఉన్న కోహ్లీ (500) ని వెన‌క్కి నెట్టాడు. వీరిద్ద‌రి త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా సాయి సుద‌ర్శ‌న్ 418, కేఎస్ రాహుల్ 406, రిష‌భ్ పంత్ 398, ఫిల్ సాల్ట్ 392, సంజు శాంస‌న్ 385, సునీల్ న‌రైన్ 372 ఉన్నారు.


More Telugu News