ఇది చూశాక సైకో పార్టీకి డిపాజిట్లు కూడా రావని అర్థమైంది: చంద్రబాబు

  • గుంటూరులో చంద్రబాబు భారీ రోడ్ షో
  • అనంతరం సభ
  • మహిళలు కూడా మగవారితో సమానంగా రోడ్ షోలో పాల్గొన్నారన్న చంద్రబాబు
  • అమరావతి రాజధాని కొనసాగి ఉంటే గుంటూరు అభివృద్ధి చెందేదని వెల్లడి
  • సైకో వచ్చి నాశనం చేశాడని వ్యాఖ్యలు
  • ముస్లింలపై చంద్రబాబు హామీల వర్షం 
టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు రోడ్ షోలో ప్రసంగించారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో నవ్యోత్సాహం పొంగిపొర్లుతోందని అన్నారు. ఇవాళ గుంటూరులో నిర్వహించిన రోడ్ షోలో మహిళలు కూడా మగవారితో సమానంగా జెండాలు పట్టుకుని పరుగులు  తీశారని, ఇది చూశాక సైకో పార్టీకి డిపాజిట్లు కూడా రావని అర్థమైందని అన్నారు. 

అమరావతిలో గుంటూరు ఓ భాగమని, అమరావతి రాజధాని కొనసాగి ఉంటే గుంటూరు ఏ స్థాయిలో ఉండేదో అని వ్యాఖ్యానించారు. సైకో వచ్చి మొత్తం నాశనం చేశాడని మండిపడ్డారు. నేను క్రియేట్ చేసిన రికార్డులను నేను బద్దలు కొట్టాలనేది నా సంకల్పం అని చంద్రబాబు పేర్కొన్నారు. 

హైదరాబాదులో అవుటర్ రింగ్ రోడ్డు 163 కిలోమీటర్లు అయితే, అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు 185 కిలోమీటర్లు అని వెల్లడించారు. చిలకలూరిపేట వరకు అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు వెళ్లేదని వివరించారు. అటు విజయవాడ అవతల హనుమాన్ జంక్షన్ వరకు వెళ్లేదని తెలిపారు. 

"ఈ దుర్మార్గుడు వచ్చి నా కలలన్నీ విధ్వంసం చేశాడు... అదీ నా బాధ. ఏ నాయకుడైనా నమ్మకం కోల్పోతే మనుగడ సాగించలేడు. నా మీద నమ్మకంతో నేను ఇచ్చిన పిలుపుతో రైతులు భూములు ఇచ్చారు. ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా 35 వేల ఎకరాలతో రాజధాని ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 

ఇక్కడుండే వారిని అడుగుతున్నా... 2019లో మీ భూమి విలువ ఎంత? ఇప్పుడు ఎంత? మీ ఇంటి బాడుగలకు ఏమైనా డిమాండ్ ఉందా? అమరావతి రాజధాని కావాలా, వద్దా? అమరావతి మాత్రం కావాలి... ఓటు మాత్రం వేయం, మళ్లీ డబ్బులిస్తే సైకోకు ఓటు వేస్తాం... అంతేనా మీ ఆలోచన? మీకు రోషం ఉందా, లేదా? కోపం ఉందా, లేదా? 

ఒక్క అమరావతి మాత్రమే కాదు, ఇంకా ఏం నష్టపోయారో అర్థమైందా? ఇంకా వైసీపీ వాళ్లు ఇక్కడ తిరుగుతున్నారు.. ఇవాళ చూపించిన హుషారును వాళ్ల ముందు కూడా చూపించి... ఇక మీరు ఇక్కడికి రావొద్దని చెప్పండి. 

ముస్లిం సోదరులు కూడా ఆలోచించాలి. నేనేమీ బీజేపీతో కొత్తగా కలవలేదు. 2014లోనే బీజేపీతో కలిశాను. హైదరాబాదులో ఉర్దూ యూనివర్సిటీ, హజ్ హౌస్ ఏర్పాటు చేశాం. అప్పుడే ముస్లింలకు ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా తీసుకువచ్చాం. మళ్లీ ఇక్కడ కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, విజయవాడ, కడపలో హజ్ హౌస్ లు నిర్మించాం. దుల్హన్, విదేశీ విద్య పథకం, ఇమామ్ లు, మౌజమ్ లకు గౌరవవేతనం ఇచ్చిన పార్టీ టీడీపీ. మసీదులకు ఆర్థికసాయం చేశాం. ఏ ఒక్క ముస్లిం సోదరుడికైనా ఇబ్బంది కలిగిందా? 

ముస్లింల 4 శాతం రిజర్వేషన్లకు ఇబ్బంది కలిగితే, సుప్రీంకోర్టులో న్యాయవాదులను ఏర్పాటు చేసి పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. టీడీపీ వస్తే రిజర్వేషన్లు పోతాయని ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, మసీదులు కూలిపోతాయట. నా పాలనలో ఏ ఒక్క ముస్లిం సోదరుడికైనా చిన్న ఇబ్బంది కలిగిందా? 

ఈ గుంటూరు, అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో ముస్లింలు ఎక్కువమంది ఉన్నారు. అలాంటిది రాజధానిని ఇక్కడ్నించి విశాఖకు తీసుకెళుతున్నాడు. దీన్నిబట్టి ముస్లింలపై ఈ ముఖ్యమంత్రికి ఎంత అభిమానం ఉందో తెలుస్తోంది. ఒక్క మసీదుకైనా సాయం చేశాడా? నేను మీటింగులు పెట్టి తిడితే, అప్పుడు ఇమామ్ లు, మౌజన్లకు రూ.5 వేలు, రూ.3 వేలు ఇచ్చిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 

ఇప్పుడు స్పష్టంగా హామీ ఇస్తున్నా... ముస్లింలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరిస్థాన్ లకు స్థలాలు  కేటాయిస్తాం. హజ్ యాత్రకు వెళ్లే వారికి రూ.1 లక్ష ఆర్థికసాయం చేస్తాం. నూర్ బాషా కార్పొరేషన్ పెట్టి ఏడాదికి రూ.100 కోట్లు కేటాయిస్తాం. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షలు వడ్డీలేని రుణాలు ఇస్తాం. 

ఇమామ్ లకు, మౌజన్లకు రూ.10 వేలు, రూ.5 వేలు గౌరవ వేతనం అందిస్తాం. ఇమామ్ లను ప్రభుత్వ ఖ్వాజీలుగా నియమిస్తాం. మసీదులకు ప్రతి నెలా రూ.5 వేలు ఆర్థికసాయం అందిస్తాం. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కాపాడతాం" అని చంద్రబాబు వివరించారు.


More Telugu News