ఐపీఎల్ లో ఇవాళ 'కింగ్స్' పోరు... విజయం ఎవరిదో!

  • చెన్నైలో నేడు పంజాబ్ కింగ్స్ × చెన్నై సూపర్ కింగ్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
  • ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్న 36 ఏళ్ల రిచర్డ్ గ్లీసన్
ఐపీఎల్ లో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం పంజాబ్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. గత మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ వంటి బలమైన జట్టును ఓడించడంతో పంజాబ్ కింగ్స్ జట్టులో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. 

ఇక, చెన్నై జట్టులో ప్రధాన పేసర్ పతిరణతో పాటు మరో సీమర్ తుషార్ దేశ్ పాండే కూడా ఆడడంలేదు. వారి స్థానంలో శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్ ఆడుతున్నారు. 36 ఏళ్ల గ్లీసన్ కు ఐపీఎల్ లో ఇదే తొలి మ్యాచ్. 

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ అయిన గ్లీసన్... 27 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ క్రికెట్ ప్రారంభించి, 34 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడం విశేషం. తన తొలి 8 బంతుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ వంటి హేమాహేమీలను అవుట్ చేయడం ద్వారా... గ్లీసన్ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు.


More Telugu News