బీసీసీఐ సెలక్టర్లపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తీవ్ర ఆగ్రహం

  • రింకూ సింగ్‌ని టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతరులు ఇష్టపడే సామర్థ్యం కంటే క్రికెట్ సామర్థ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యమని విమర్శ
  • రవీంద్ర జడేజా మినహా మ్యాచ్ గెలిపించేవారు ఒక్కరైనా ఉన్నారా అని బీసీసీఐకి ప్రశ్న
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ సంచలన రింకూ సింగ్‌ను టీ20 వరల్డ్ కప్ 2024కు ఎంపిక చేయకపోవడంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన నాటి అతడు అద్భుతంగా ఆడుతున్నప్పటికీ పరిగణనలోకి తీసుకోకపోవడంపై పలువురు మాజీలు, క్రికెట్ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తున్నారు.

రింకూ సింగ్‌ని విస్మరించడంతో బీసీసీఐ సెలక్టర్లపై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ లైక్స్ పొందే సామర్థ్యం కంటే క్రికెట్ సామర్థ్యం ఉన్నవారికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలంటూ విమర్శించాడు. ‘‘ క్రికెట్ పరిజ్ఞానం లేకుండా సెలక్షన్ జరుగుతున్నట్టు రింకూ సింగ్‌ను పక్కనపెట్టాక స్పష్టమవుతోంది. టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన జట్టులో గత రెండేళ్లుగా మ్యాచుల్లో చివరి 16వ, 17వ ఓవర్‌లలో క్రీజులోకి వచ్చి బ్యాటింగ్ చేస్తుందెవరు? రవీంద్ర జడేజా మినహా ఒక్క మ్యాచ్‌ అయినా గెలిపించగల ఆటగాళ్లు అందులో ఎవరైనా ఉన్నారా? రింకూ సింగ్ మిస్ అవడం చాలా పెద్ద తప్పిదం. పరిమాణం కంటే నాణ్యత చాలా అవసరం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతరులు ఇష్టపడే సామర్థ్యం కంటే ముందు క్రికెట్ సామర్థ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం’’ అని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా స్పందించాడు.

కాగా ఐపీఎల్‌లో ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ నిబంధనకు రింకూ సింగ్ మూల్యం చెల్లించుకున్నాడని, ఈ నిబంధన కారణంగా అతడిని తుది జట్టులోకి తీసుకోకపోవడం ప్రతికూలం అయ్యిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే 15 మంది సభ్యుల టీమ్‌లో రింకూ సింగ్‌కు చోటు దక్కకపోయినప్పటికీ రిజర్వ్ ప్లేయర్‌ జాబితాలో శుభ్‌మాన్ గిల్, ఖలీల్ అహ్మద్‌, అవేశ్ ఖాన్‌‌లతో పాటు రింకూ సింగ్ పేరు కూడా ఉంది.


More Telugu News