ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వివరణ ఇచ్చిన సీఎం జగన్

  • అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో వైసీపీ ఎన్నికల సభ
  • విపక్షాల విమర్శలకు సమాధానమిచ్చిన సీఎం జగన్
  • భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వెల్లడి
  • చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. 

సమగ్ర సర్వే ద్వారా భూములపై వారికే హక్కులు కల్పిస్తున్నామని వివరించారు. కానీ, చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. జగన్ క్యారెక్టర్ ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, జగన్ భూములు ఇచ్చేవాడే కానీ, భూములు లాగేసుకునేవాడు కాదని స్పష్టం చేశారు.

"వందేళ్ల కిందట బ్రిటీష్ వారి పాలనలో భూ సర్వే జరిగింది. ఆ తర్వాత మరోసారి భూ సర్వే నిర్వహించలేదు. సమగ్ర సర్వే లేకపోవడంతో భూముల సబ్ డివిజన్ జరగలేదు... భూముల కొలతలు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తమ భూములను అమ్ముకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగడమే కాదు, కొన్నిసార్లు కోర్టులకు వెళ్లాల్సి వస్తోంది. ప్రజలకు డబ్బులు కూడా ఖర్చవుతున్నాయి. ఈ పరిస్థితి మారాలన్న ఉద్దేశంతోనే ప్రతి గ్రామంలో రీ సర్వే చేయించాం. 

భూమి మీద సొంతదారుకు సంపూర్ణ హక్కు ఇవ్వాలన్నదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లక్ష్యం. భూములకు హద్దులు నిర్ణయించి, రికార్డును నవీకరించి, ఆ వివరాలతో రిజిస్ట్రేషన్లు చేసి మళ్లీ రైతులకు అందించే కార్యక్రమం జరుగుతుంటే... చేతనైతే మద్దతు పలకాలి కానీ, దుష్ప్రచారం చేయడం తగదు" అని సీఎం జగన్ స్పష్టం చేశారు.


More Telugu News