సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పుల ఘటన కేసులో నిందితుడి ఆత్మహత్య

  • జైలులో ఉరివేసుకుని మృతి
  • దుప్పటితో ఉచ్చుబిగించుకున్న అనూజ్ తపన్
  • ఏప్రిల్ 26న అరెస్ట్ చేసిన పోలీసులు
బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వెలుపల గత నెలలో కాల్పుల కలకలం కేసులో నిందితుడిగా ఉన్న అనూజ్ తపన్ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి తన బ్యారక్‌లో ఉరివేసుకున్నాడు. రాత్రి నిద్రించేందుకు కేటాయించిన దుప్పటితో అతడు ఉరి బిగించుకున్నాడు. బుధవారం ఉదయం పోలీసులు సాధారణ తనిఖీ కోసం వెళ్లగా అపస్మారక స్థితిలో పడివున్న అనూజ్‌ తపన్‌ను గుర్తించారు. అత్యవసరంగా హాస్పిటల్‌కు తరలించినప్పటికీ.. అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించినట్టు తెలుస్తోంది.

కాగా ముంబైలోని బాంద్రా ఏరియాలో ఉన్న సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులకు పాల్పడ్డ నిందిత షూటర్లు విక్కీ గుప్తా, సాగర్ పాల్‌లకు అనూజ్ తనన్ ఆయుధాలు అందించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఏప్రిల్ 26న అనూజ్‌‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

కాగా అనూజ్ ఆత్మహత్యాయత్నానికి దారితీసిన కారణాలపై విచారణ జరుగుతోందని ముంబై పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే ఇది ముమ్మాటికి హత్యేనని మహారాష్ట్ర మాజీ సీనియర్ పోలీసు అధికారి పీకే జైన్ అనుమానం వ్యక్తం చేశారు. లాకప్‌లో ఎవరు మరణించినా హత్యగానే పరిగణించాలని అన్నారు. పోలీసులు సాధారణంగా లాకప్‌లను తనిఖీ చేస్తుంటారని అన్నారు. ఖైదీలు తప్పించుకోకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా పోలీసుల నిఘా ఉంటుందని సందేహాలు లేవనెత్తారు.


More Telugu News