వైసీపీకి ఓటేస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలే!: మండపేటలో పవన్ కల్యాణ్

  • కోనసీమ జిల్లా మండపేటలో వారాహి విజయభేరి సభ
  • మన ఆస్తి పత్రాలపై జగన్ హక్కు ఏంటన్న పవన్ కల్యాణ్
  • ఈ విషయంపై ప్రజలు నిలదీయాలని పిలుపు
  • జగన్ కు, వైసీపీకి ప్రజలు పొలిటికల్ హాలిడే ప్రకటించాలని వ్యాఖ్యలు
కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రస్తావించారు. వైసీపీకి ఓటేస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలే అవుతాయని వ్యాఖ్యానించారు. మన ఆస్తి పత్రాలపై జగన్ హక్కు ఏంటి? ఈ విషయాన్ని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. 

భారత పాస్ పోర్టుపై ప్రధాని మోదీ ఫొటో ఉండదని, ఏపీలో పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకని ప్రశ్నించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ రాజముద్ర ఉండాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

రాష్ట్ర ప్రజలకు జగన్ పాలన నుంచి విముక్తి కలిగించాలన్నదే తన బలమైన ఆకాంక్ష అని అన్నారు. గత పదేళ్లుగా తనను అనేక ఇబ్బందులకు గురిచేశారని, ఎన్నో మాటలు అన్నారని తెలిపారు. ప్రజల కోసం ఎన్ని మాటలైనా భరిస్తానని, ప్రజాసంక్షేమం కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. 

ఓటు చీలకూడదు... ప్రజలే గెలవాలి... వైసీపీ అవినీతి కోటను బద్దలు కొట్టాలి అనేదే తన లక్ష్యమని వివరించారు. ఈ ఎన్నికల ద్వారా జగన్, వైసీపీకి పొలిటికల్ హాలిడే ప్రకటించాలని పిలుపునిచ్చారు.


More Telugu News