మలయాళంలో సంజూ శాంసన్ ఎమోషనల్ పోస్ట్

  • టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో చోటు దక్కడంపై సోషల్ మీడియాలో తొలి రియాక్షన్
  • మంజుమ్మల్ బాయ్స్ సినిమాలోని ‘చెమట, కష్టం కుట్టిన చొక్కా’ పాట లిరిక్స్ పంచుకున్న కేరళ క్రికెటర్
  • అభిమానుల ఫిదా.. ఈ పాటలోని సాహిత్యం సంజూ కోసం రాసినట్లుగా ఉందంటూ కామెంట్లు
టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో చోటుదక్కడంతో మలయాళీ ఆటగాడు సంజూ శాంసన్ సోషల్ మీడియాలో తన మొదటి రియాక్షన్ ఇచ్చాడు. మలయాళంలో ఇటీవల సూపర్ హిట్ అయిన మంజుమ్మల్ బాయ్స్ సినిమాలోని ‘చెమట, కష్టం కుట్టిన చొక్కా’ అంటూ మొదలయ్యే పాట లిరిక్స్‌ ని షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ మేరకు లిరిక్స్‌ తో కూడిన సూపర్ హిట్ పాటను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకున్నాడు. దీనిపై నెటిజన్లు, శాంసన్ అభిమానులు స్పందించారు. ఈ పాట సంజూ కోసం రాసిన సాహిత్యంలా ఉందని కామెంట్లు పెట్టారు. 

టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును సెలక్టర్లు సోమవారం సాయంత్రం ప్రకటించడం తెలిసిందే. ఈ జట్టులో రిషబ్ పంత్‌తో పాటు వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ చోటు దక్కించుకున్నాడు. 2011 వన్డే ప్రపంచకప్ తర్వాత ఓ మలయాళీ ఆటగాడు భారత్ తరఫున ప్రపంచకప్ ఆడనుండటం ఇదే తొలిసారి. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌ గా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌ గా శాంసన్ చేస్తున్న అద్భుత ప్రదర్శన అతనికి ప్రపంచకప్ జట్టులో చోటు కల్పించింది. 

చివరి క్షణం వరకు ఉత్కంఠతో ప్రపంచకప్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. రిషబ్ పంత్‌తో పాటు మరో కీపర్‌‌ బ్యాట్స్ మన్ కె. ఎల్. రాహుల్ ప్రపంచ కప్ జట్టులోకి వస్తాడనే అంచనాలు ఉండగా వాటిని తలకిందులు చేస్తూ శాంసన్ భారత జట్టులో చోటు సంపాదించాడు.

శాంసన్ 2015లో జింబాబ్వేతో మ్యాచ్ ద్వారా టీ20 అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. అయితే ధోనీ, పంత్, కేఎల్ రాహుల్ లాంటి వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ బాగా ఆడటం వల్ల అతనికి పెద్దగా అవకాశాలు లభించలేదు. ఇప్పటివరకు 25 ఇంటర్నేషనల్ టీ20లలో శాంసన్ కేవలం 374 పరుగులే చేశాడు. అందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది. అతని బ్యాటింగ్ సగటు 18.70కాగా స్ట్రైక్ రేట్ 133.09గా ఉంది. అతని అత్యుత్తమ స్కోర్ 77.

కానీ ఐపీఎల్ లో మాత్రం శాంసన్ అదరగొడుతున్నాడు. మొత్తం 161 మ్యాచ్ లలో 30.96 సగటుతో 4,273 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని బెస్ట్ స్కోర్ 119. ఇక ఐపీఎల్ 2024లో తన బ్యాటింగ్ మెరుపులతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్ లలో  77 సగటుతో 385 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.


More Telugu News