నారా లోకేశ్ మే డే శుభాకాంక్షలు

  • శ్రామిక ప్రపంచానికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్
  • అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా యువనేత
  • రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పర్యటిస్తున్న లోకేశ్
కార్మికుల దినోత్సవం ‘మే డే’ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్ శ్రామిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మేడే శుభాకాంక్షలు చెబుతూ కవితాత్మకంగా లోకేశ్ సందేశం ఇచ్చారు. ‘కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం శారీరకష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్ర వృత్తుల- సమస్త చిహ్నాలతో జగతికి మూలమైన కార్మిక, కర్షక, శ్రామిక ప్రపంచానికి మేడే శుభాకాంక్షలు’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో యువనేత లోకేశ్ బిజీబిజీగా ప్రచారం చేస్తున్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో లోకేశ్ సుడిగాలి పర్యటనలు చేపట్టారు. యువతను సన్నద్ధం చేయడానికి సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు యువతతో ముఖాముఖీ చేపడుతున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొన్న 20 లక్షల ఉద్యోగాల కల్పన, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి హామీలపై అవగాహన కల్పిస్తారు. టీడీపీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. లోకేశ్ యాత్ర మే 1న నెల్లూరు, 2న రాజంపేట, 3న కర్నూలు, 4న నంద్యాల, 5న చిత్తూరు, 6న ఏలూరు లోక్ సభ నియోజకవర్గాల్లో సాగనుంది.


More Telugu News