భూమి బరువు ఎందుకు తగ్గుతుంది?.. ఎందుకు పెరుగుతుంది?

  • భూమి బరువు 5.9722 సెప్టీలియన్లు
  • అంతరిక్షం నుంచి ప్రతి ఏడాది అదనంగా వచ్చి చేరుతున్న 40 వేల టన్నుల బరువు
  • అదే సమయంలో అంతరిక్షంలో కలుస్తున్న వేల టన్నుల భూమి బరువు
మనమైతే సాధారణంగా 60 నుంచి 70 కిలోల వరకు బరువు ఉంటాం. కొందరు మాత్రం ‘సెంచరీ’కి అటూఇటుగా ఉంటారు. మరి భూమి బరువు ఎంత ఉంటుంది? ఇదేం పిచ్చి ప్రశ్న? దానినెలా తూస్తారు? అన్న ప్రశ్న తలెత్తడం సహజమే. భూమి బరువు అటూఇటుగా 5.9722 సెప్టీలియన్లు. అర్థం కావడం కొంచెం కష్టంగా ఉంది కదూ! ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే 1 పక్కన 24 సున్నాలు పెడితే ఎంత అవుతుందో, దానినే సెప్టీలియన్ అంటారు. అంటే వెయ్యి కోట్ల కోట్ల కోట్లన్నమాట. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే..  వెయ్యికోట్ల మందికి కోటిసార్లు కోటి కిలోల చొప్పున పంచితే ఎంతో అంతన్నమాట. 

భూగోళం అంత బరువుందన్న సంగతి ఎలా తెలిసింది? దానిని తూచేందుకు అంతపెద్ద కాంటాను ఎక్కడి నుంచి తెచ్చారు? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. భూమి గ్రావిటీ, పరిమాణం, ఉపరితల వైశాల్యం, భూమిలోని పదార్థాలను శాస్త్రీయంగా గణించి ఈ లెక్క తేల్చారు శాస్త్రవేత్తలు. అయితే, ఈ బరువు ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎందుకలా? అంతరిక్షం నుంచి నిరంతరం ధూళి, చిన్నచిన్న గ్రహశకలాలు నిత్యం భూమిని చేరుతూనే ఉంటాయి. ఈ కారణంగా ఏటా భూమి బరువు 40 వేల టన్నుల మేర పెరుగుతోంది. అదే సమయంలో భూమి బరువు కూడా తగ్గుతూ ఉంటుంది. దీనికి కారణం.. భూమి వాతావరణం లోనుంచి అంతరిక్షంలోకి లీకయ్యే వాయువులు, పదార్థాలతో వేల టన్నుల మేర బరువు తగ్గుతూ ఉంటుంది. ఇక, భూమ్మీద ఉన్న మానవ నిర్మిత కట్టడాల్లో ఈజిప్టులోని పిరమిడ్ అన్నింటికంటే బరువైనది. ఇది ఏకంగా 480 కోట్ల కిలోలు.

 



More Telugu News