ఢిల్లీలో ఒకేసారి 12 పాఠ‌శాల‌ల‌కు బాంబు బెదిరింపులు.. పోలీసుల ముమ్మ‌ర త‌నిఖీలు!

  • ఒకేసారి 12 స్కూళ్లకు బాంబు బెదిరింపుల‌తో కూడిన మెయిల్స్
  • వెంట‌నే పోలీసుల‌ను సంప్ర‌దించిన ఆయా స్కూల్ యాజ‌మాన్యాలు
  • పాఠ‌శాల‌ల‌ను ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్‌తో సోదాలు చేస్తున్న పోలీసులు
దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఒకేసారి ప‌న్నెండు ప్ర‌ముఖ‌ పాఠ‌శాల‌ల‌కు బాంబు బెదిరింపుల కాల్స్ రావడంతో కలకలం రేగింది. సదరు స్కూళ్లకు బాంబు బెదిరింపుల‌తో కూడిన మెయిల్స్ వ‌చ్చాయి. దాంతో ఆయా స్కూల్ యాజ‌మాన్యాలు పోలీసుల‌ను సంప్ర‌దించాయి. రంగంలోకి దిగిన పోలీసులు వెంట‌నే పాఠ‌శాల‌ల‌ను ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్‌తో సోదాలు నిర్వ‌హిస్తున్నారు. 

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని వ‌సంత్ కుంజ్‌, సాకేత్‌, ద్వార‌క‌, మ‌యూర్ విహార్‌, చాణక్యపురి, నోయిడాలోని ప‌లు స్కూళ్ల‌కు బాంబు బెదిరింపుల నేప‌థ్యంలో ఈ-మెయిల్ వ‌చ్చింది. వీటిలో కొన్ని పాఠశాల‌లో ఇవాళ ఎగ్జామ్స్ జ‌రుగుతున్నాయి. కానీ, బెదిరింపుల కార‌ణంగా ప‌రీక్ష‌ల‌ను మ‌ధ్య‌లోనే ఆపేసి విద్యార్థుల‌ను ఇంటికి పంపించేశారు. 

ప్ర‌స్తుతం ఈ పాఠ‌శాల‌ల ప్రాంగ‌ణాల‌లో పోలీసులు బాంబు స్క్వాడ్‌తో త‌నిఖీలు చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి పేలుడు ప‌దార్థాలు ల‌భించ‌లేద‌ని స‌మాచారం. ఇక బెదిరింపుల‌తో కూడిన మెయిల్ ఎక్క‌డి నుంచి వ‌చ్చింది, ఎవ‌రు చేశారు? అనేది తెలుసుకునే ప‌నిలో పోలీసులు ఉన్నారు. కాగా, ఈ-మెయిల్ ఐపీ అడ్ర‌స్‌ను బట్టి విదేశాల నుంచి వ‌చ్చిన‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో నిర్దార‌ణ అయింది. ఒకే వ్య‌క్తి వీటిని చేసి ఉంటాడ‌ని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే.. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో కూడా ఇలాగే ఢిల్లీలోని కొన్ని పాఠ‌శాల‌ల‌కు బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. అప్పుడు కూడా పోలీసులు సోదాలు చేయ‌గా ఎలాంటి పేలుడు ప‌దార్థాలు దొర‌క‌లేదు.


More Telugu News