ఆ హీరో చాలా సీరియస్ గా ఉండేవారు: సీనియర్ హీరోయిన్ యమున

  • 'మౌనపోరాటం'తో పరిచయమైన యమున
  • వినోద కుమార్ ఇబ్బంది పడ్డారని వెల్లడి 
  • దాసరి గారితో వర్క చేయడం అదృష్టమని వ్యాఖ్య 
  • ఆయన గొప్పతనం అదేనని వివరణ  

యమున .. తన తొలి సినిమా 'మౌనపోరాటం'తోనే ఆమె ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆ తరువాత వచ్చిన 'ఎర్ర మందారం' .. 'మామగారు' వంటి సినిమాలు, ఆమె కెరియర్ గ్రాఫ్ ను పెంచుతూ వెళ్లాయి. తాజాగా 'సిగ్నేచర్ స్టూడియోస్' వారికి ఇచ్చిన ఇంటర్యూలో యమున మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

'మౌనపోరాటం' సినిమా తరువాత నేను వరుసగా చాలా సినిమాలు చేసి ఉండవలసింది. అలాగే పెద్ద హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుని ఉండవలసింది. కానీ అప్పటికీ నాకు ఏమీ తెలియదు. ఎలా ముందుకు వెళ్లాలి .. కెరియర్ ను ఎలా బిల్డ్ చేసుకోవాలనే విషయంలో ఎంతమాత్రం అవగాహన ఉండేది కాదు. అందువలన నేను పెద్ద సినిమాలు చేయలేకపోయానని అనుకుంటున్నాను. అలా అని చెప్పి ఆ విషయాన్ని గురించి బాధపడటం లేదు కూడా" అని అన్నారు. 

"వినోద్ కుమార్ తో నా కాంబినేషన్ చాలా బాగుంటుందని అంతా అనుకుంటారు. ఇద్దరం కలిసి అంత సహజంగా నటిస్తున్నామంటే చాలా ఫ్రెండ్లీగా ఉండి ఉంటామని అనుకుంటారు. కానీ నిజానికి ఆయన చాలా సీరియస్ గా ఉండేవారు. ఎక్కువగా మాట్లాడేవారు కాదు. నేను గలగలమని మాట్లాడే టైపు .. ఆయనేమో సైలెంట్. అందువలన ఆయనతో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ.

వినోద్ కుమార్ గారు చాలా హైట్ ఉండేవారు .. నేను చూస్తే హైట్ తక్కువ. అందువలన ఇద్దరికీ అస్సలు మ్యాచ్ అయ్యేది కాదు. నా పక్కన  కాస్త వంగిపోయి నిలబడటానికి ఆయనకి విసుగు వచ్చేది.  అయినా మా కాంబినేషన్లో వచ్చిన సినిమాలు హిట్ కావడం గొప్ప విషయం" అని చెప్పారు. "ఇక దాసరి నారాయణరావుగారి దర్శకత్వంలోను  .. ఆయన నటుడిగా చేసిన సినిమాలలోను నాకు అవకాశం దొరకడాన్ని నేను అదృష్టంగా భావిస్తూ ఉంటాను. అయన అప్పటికప్పుడు సీన్స్ రాయడం .. డైలాగ్స్ రాయడం చూసి ఆశ్చర్యపోయేదానిని" అని చెప్పారు. 


More Telugu News