ఇండిపెండెంట్‌లకు గ్లాసు గుర్తు కేటాయించడంపై సీఈసీకి టీడీపీ ఫిర్యాదు

  • జనసేన పోటీ చేయని చోట్ల ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు 
  • ఓటర్లలో వైసీపీ గందరగోళం సృష్టిస్తోందన్న కనకమేడల
  • పెన్షన్ల పంపిణీకి కూడా ఏర్పాట్లు చేయలేదని విమర్శ
ఏపీ ఎన్నికల్లో జనసేన గుర్తు గాజు గ్లాసును ఇండిపెండెంట్లకు కూడా కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతోపాటు, మే నెలలో ఇవ్వాల్సిన పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడంపై కూడా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయని... జనసేన పోటీ చేస్తున్న చోట కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులకు గ్లాస్ గుర్తును కేటాయిస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు కావాలనే కొన్ని చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులతో పోటీ చేయిస్తున్నారని దుయ్యబట్టారు. 

కొన్ని చోట్ల రిటర్నింగ్ అధికారులు కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కనకమేడల అన్నారు. ఓటర్లలో గందరగోళం సృష్టించి... దాని ద్వారా లబ్ధి పొందాలని వైసీపీ యత్నిస్తోందని విమర్శించారు. జనసేన పోటీ చేయని చోట ఇతరులకు గ్లాస్ గుర్తును కేటాయించేలా వైసీపీ వ్యవహరించిందని అన్నారు. సకాలంలో పెన్షన్లను ఇవ్వకుండా... పెన్షనర్లను రెచ్చగొట్టి ఓట్లు పొందాలని జగన్ కుట్ర పన్నుతున్నారని చెప్పారు. కొందరు ఎన్నికల అధికారులు జగన్ పట్ల భక్తిని ప్రదర్శిస్తున్నారని అన్నారు.


More Telugu News