ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్... ఏడుగురు మావోల మృతి

  • ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ కు మరోసారి ఎదురుదెబ్బ
  • నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లో ఎదురుకాల్పులు
  • దాడుల్లో పాల్గొన్న డీఆర్ జీ, ఎస్టీఎఫ్ బలగాలు
  • మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు
ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో ఒక ఏకే-47 రైఫిల్, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో డీఆర్ జీ, ఎస్టీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి.

నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లోని అబూజ్ మాడ్ అటవీప్రాంతం ఈ ఉదయం కాల్పుల మోతతో దద్దరిల్లింది. టేక్ మెట్ట, కాకూరు గ్రామాల మధ్య ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. సీనియర్ మావోయిస్టు నేతలు సమావేశమవుతున్నారన్న సమాచారంతో డీఆర్ జీ, ఎస్టీఎఫ్ బలగాలు పక్కా ప్రణాళికతో అబూజ్ మాడ్ అటవీప్రాంతంలో ప్రవేశించాయి. 

కాకూరు గ్రామం వద్దకు చేరుకునే సరికి ఇరు వైపులా కాల్పులు ప్రారంభం అయ్యాయి. కాల్పుల అనంతరం ఘటన స్థలంలో ఏడు మృతదేహాలను కనుగొన్నట్టు బస్తర్ రేంజి ఐజీ పి.సుందర్ రాజ్ వెల్లడించారు. ఛత్తీస్ గఢ్ లో ఈ నెల 16న జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 29 మంది నక్సల్స్ మరణించడం తెలిసిందే.


More Telugu News