రిజర్వేషన్లపై తన ఫేక్ వీడియో వైరల్ కావడంపై తీవ్రంగా స్పందించిన అమిత్ షా

  • అసహనంతో కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలు తయారు చేస్తోందని మండిపాటు
  • ఫేక్ వీడియోలను షేర్ చేయడం వెనుక రాహుల్ గాంధీ హస్తం ఉందని ఆరోపణ
  • కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఫేక్ వీడియోను షేర్ చేశారని ఆగ్రహం
రిజర్వేషన్లపై తన ఫేక్ వీడియో వైరల్ కావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. అసహనంతో కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలు తయారు చేస్తోందని మండిపడ్డారు. ఫేక్ వీడియోలను షేర్ చేయడం వెనుక రాహల్ గాంధీ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో రాహుల్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. బీజేపీకి 400 సీట్లు ఇస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని రాహుల్ గాంధీ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ తరగతులకు రిజర్వేషన్లను బీజేపీ ఎన్నటికీ తొలగించదని హామీ ఇచ్చారు. అలాగే తొలగించేందుకు చేసే కుట్రలను కూడా అనుమతించదని స్పష్టం చేశారు. ఇది మోదీ గ్యారెంటీ అని వ్యాఖ్యానించారు. మోదీ రిజర్వేషన్ మద్దతుదారు అని పేర్కొన్నారు. తమకు రెండుసార్లు పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ రిజర్వేషన్లు తొలగించలేదని... ఇకముందు కూడా తొలగించబోమన్నారు.

అయితే మత ఆధారిత రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని మంత్రి పునరుద్ఘాటించారు. తమ మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనతో పాటు తమ పార్టీకి చెందిన నేతల ఫేక్ వీడియోలను తయారు చేసే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందన్నారు. ఫేక్ వీడియో ద్వారా అసత్య ప్రచారం చేసిన వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఇతరులు ఈ ఫేక్ వీడియోను షేర్ చేశారన్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి చెందిన ప్రముఖ నేత క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రాజకీయాలను మరింత దిగజార్చే పనిలో పడ్డారని ఆరోపించారు. అబద్దాలు ప్రచారం చేయడం ఏ పార్టీకి మంచిది కాదన్నారు.

అమిత్ షా ఫేక్ వీడియో కేసులో మరిన్ని అరెస్టులు

రిజర్వేషన్లపై అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ డిపార్టుమెంట్ పోలీసులు మంగళవారం మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. సతీశ్ వాన్సోలా, ఆర్వీ వారియాలను అరెస్ట్ చేశారు. సతీశ్ వాన్సోలా, కాంగ్రెస్ నేత జిగ్నేష్ మేవాని పీఏలపై 505 ఏ, 1బీ, 469, 153ఏ, ఐటీ యాక్ట్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


More Telugu News