ప్లేట్ పానీపూరీ రూ. 333.. అవాక్కయిన వ్యాపారవేత్త!

  • ముంబై ఎయిర్ పోర్టులో అసాధారణ ధరలపై కౌశిక్ ముఖర్జీ అసహనం
  • విమనాశ్రయాల్లోని స్టాల్స్ లో ధరలు ఎక్కువని తెలుసుగానీ ఇంతలా ఉంటాయని అనుకోలేదంటూ పోస్ట్
  • వైరల్ గా మారిన పోస్ట్.. ఆయన అభిప్రాయంతో ఏకీభవించిన నెటిజన్లు
పానీపూరీ ధర ఎంతుంటుంది? రోడ్డు పక్కన బండ్లపై అయితే ప్లేట్ 10 రూపాయిలకు మించదు. అదే కాస్త పెద్ద ఈటరీలలో అయితే మరో రెండు, మూడు రెట్లు రేటు వసూలు చేస్తారు.

కానీ ముంబై ఎయిర్ పోర్ట్ లోని షాప్ లలో మాత్రం కళ్లు తిరిగే రేట్లకు పానీపూరీ అమ్ముతున్నారు. ప్లేట్ పానీపూరీని ఏకంగా రూ. 333 కు విక్రయిస్తున్నారు.

దీన్ని చూసిన కౌశిక్ ముఖర్జీ అనే వ్యాపారవేత్త కూడా అవాక్కయ్యాడు. ఇవేం ధరలు బాబోయ్ అంటూ ముక్కున వేలేసుకున్నాడు.

ఎయిర్ పోర్టులోని ఫుడ్ స్టాల్స్ లో రేట్లు ఎక్కువని తెలుసుగానీ.. మరీ ఇంతగానా? అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఒక ఫుడ్ స్టాల్ లో డిస్ ప్లే లో రూ. 333 అనే ప్రైస్ ట్యాగ్ తో ఉన్న ప్లేట్ పానీపూరీ ఫొటోను నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు.

ఆ ఫొటోలో పానీపూరీతోపాటు పక్కనే దహీ పూరీ, సేవ్ పూరీ కూడా ఉన్నాయి. ఒక్కో ప్లేట్ లో ఎనిమిదేసి పీసులు ఉన్నాయి. వాటి అన్నింటి ధరలు కూడా ప్లేట్ 333 రూపాయలుగా స్టాల్ లోని విక్రేతలు పేర్కొనడం గమనార్హం.

ఈ పోస్ట్ తెగ వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్లు ఎయిర్ పోర్ట్ లోని ఫుడ్ స్టాల్ అసాధారణ ధరలను తప్పుబట్టారు. ఈ ధరలు తనకు బ్లాక్ బస్టర్ బాలీవుడ్ చిత్రం ‘3 ఇడియట్స్’లో హీరో ఆమిర్ ఖాన్ చెప్పిన ఓ డైలాగ్ ను గుర్తుచేశాయని ఓ నెటిజన్  కామెంట్ చేశాడు. ‘కొన్ని రోజుల తర్వాత పన్నీర్ కూడా బంగారం షాపుల్లో చిన్నచిన్న ప్యాకెట్లలో దొరుకుతుందేమో’ అంటూ ఆమిర్ ఖాన్ ఆ సినిమాలో అంటాడు.

గతేడాది ముంబై ఎయిర్ పోర్టులోని ఓ రెస్టారెంట్ ఒక దోశకు రూ. 600, గ్లాస్ బటర్ మిల్క్ కు ఏకంగా రూ. 620 వసూలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అంతకుముందు కూడా అదే ఎయిర్ పోర్టులో రెండు సమోసాలు, ఓ కప్పు టీ, ఒక వాటర్ బాటిల్ కు రూ. 490 ఖర్చు పెట్టాల్సి వచ్చిందంటూ ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.

అధిక రేట్ల నుంచి తప్పించుకొనేందుకు చాలా మంది విమాన ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లోని లాంజ్ లలో తింటుంటారు. క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు యాక్సెస్ ద్వారా నామమాత్రమైన రేట్లకే అక్కడ బఫే పద్ధతిలో రకరకాల ఐటెమ్స్ లభిస్తాయి.


More Telugu News