జ‌డేజా ఆ స్థానంలో బ్యాటింగ్‌కు స‌రిపోడు.. టీమిండియాకు ఇబ్బందులు త‌ప్ప‌క‌పోవ‌చ్చు: టామ్ మూడీ

  • ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి జ‌డ్డూ స‌రిపోడ‌న్న టామ్ మూడీ
  • ఆ స్థానంలో టీమిండియాకు మంచి మ్యాచ్ ఫినిష‌ర్ కావాల‌ని వ్యాఖ్య‌
  • అంత‌ర్జాతీయ స్థాయిలో అత‌ని స్ట్రైక్ రేట్ అంత మంచిగా లేద‌న్న ఆస్ట్రేలియ‌న్ మాజీ క్రికెట‌ర్‌ 
  • ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చిన భారత మాజీ ఆల్‌రౌండ‌ర్‌ ఇర్ఫాన్ పఠాన్ 
ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్ సీజ‌న్‌లో భార‌త స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా ప్ర‌ద‌ర్శ‌నపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా బ్యాటింగ్‌లో జ‌డ్డూ త‌డ‌బ‌డుతున్నాడు. ఇదే విష‌య‌మై ఆస్ట్రేలియ‌న్ మాజీ క్రికెట‌ర్‌ టామ్ మూడీ ఆందోళ‌న వ్య‌క్తం చేశాడు. "స్పిన్ బౌలింగ్‌, ఫీల్డింగ్ విష‌యంలో జ‌డేజా ఎంపిక ఉత్త‌మ‌మైన‌దే. కానీ, టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్‌కు ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి అత‌డు క‌రెక్ట్ కాదు. ఆ స్థానంలో మంచి మ్యాచ్ ఫినిష‌ర్ కావాలి. అయితే, ప్ర‌స్తుతం జ‌డేజా బ్యాటింగ్ చేస్తున్న విధానం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. అందుకే నెంబర్ 7లో అత‌డు స‌రిపోడు" అని టామ్ మూడీ చెప్పుకొచ్చాడు. 

ఇక సీఎస్‌కేకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ర‌వీంద్ర జ‌డేజాను ఆ జ‌ట్టు బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ప్ర‌మోషన్ క‌ల్పించింది. దీంతో ఏడో స్థానంలో కాకుండా  4, 5 స్థానాల్లో బ్యాటింగ్‌కి దిగుతున్నాడు. ఇలా ఇప్ప‌టివ‌ర‌కు 9 మ్యాచులాడిన జ‌డ్డూ 131.93  స్ట్రైక్ రేట్‌తో కేవ‌లం 157 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇదే విష‌య‌మై టామ్ మూడీ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. "నేను జడేజాను త‌ప్ప‌నిస‌రిగా వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో తీసుకుంటాను. ఎందుకంటే ఉత్తమ ఎడమచేతి స్పిన్నింగ్ కోసం అత‌డు బెస్ట్ ఛాయిస్‌. అతను దేశంలోనే అత్యుత్తమ లెఫ్టార్మ్ స్పిన్నర్. అయితే, ప్లేయింగ్ 11లో అతను నం.7లో బ్యాటింగ్ చేయలేడు. జ‌డేజా ప్రపంచకప్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి సరిపోతాడని నేను అనుకోను. ప్ర‌స్తుత అత‌ని స్ట్రైక్ రేట్‌ ఈ విషయాన్ని నిరూపిస్తుంది. ఏడో స్థానం వద్ద బ్యాటింగ్ చేసే ఇంపాక్ట్-టైప్ ప్లేయర్ కావాలి” అని టామ్ మూడీ చెప్పాడు. 

ఇక ఇదే చర్చా ప్యానెల్‌లో భాగమైన భారత మాజీ స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. జడేజాను నంబర్ 7లో ఆడించాలంటే రోహిత్ సేన‌కు మ‌రో సరైన ఫినిషర్ అవ‌స‌రం ఉంటుందని అన్నాడు.

"టీ20 ప్రపంచ కప్ విషయానికి వస్తే నేను నిజంగా భయపడేది ఇదే. టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌కి సంబంధించినంతవరకు ఎలాంటి స‌మ‌స్య లేదు. అలాగే మిడిల్ ఆర్డ‌ర్‌లో కూడా బాగానే ఉంది.  తీరా రవీంద్ర జడేజా విష‌యంలోనే కాస్త ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంది. అత‌డు నెంబర్ 7లో బ్యాటర్ అని అనుకుంటే, ఆఖ‌రులో భార‌త్‌కు మ‌రో మంచి ఫినిషర్ కావాలి. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో స్ట్రైక్ రేట్‌కు సంబంధించినంత వరకు జ‌డ్డూ గ‌ణాంకాలు అంత గొప్పగా లేవు" అని ఇర్ఫాన్ ప‌ఠాన్‌ వివరించాడు.


More Telugu News