కొవిడ్ టీకా సృష్టికర్తపై చైనా వేటు.. పార్లమెంటు నుంచి బహిష్కరణ

  • అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా టాప్ సైంటిస్ట్ యాంగ్ షావోమింగ్
  • తొలి కరోనా టీకాను అభివృద్ధి చేసింది ఆయన నేతృత్వంలోని బృందమే
  • ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసిన ఎన్‌పీసీ
చైనా టాప్ సైంటిస్ట్ , ఆ దేశ తొలి కొవిడ్ టీకా అభివృద్ధికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్తపై చైనా వేటేసింది. క్రమశిక్షణ, చట్ట ఉల్లంఘన, అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన సభ్యత్వాన్ని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ) రద్దుచేసింది. అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ)లో అవినీతి విపరీతంగా పెరిగింది. ఇందుకోసం క్రమశిక్షణ, చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్న కేసులు ఎక్కువయ్యాయి. ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న యాంగ్ షావోమింగ్  (62)ను పార్లమెంటు నుంచి ప్రభుత్వం బహిష్కరించింది.

యాంగ్ దేశంలోని టాప్ శాస్త్రవేత్తల్లో ఒకరు. చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ (సీఎన్‌బీజీ) అనుబంధ చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని బృందం కరోనా సమయంలో దేశ తొలి కొవిడ్ టీకా సినోఫార్మ్‌కు చెందిన బీబీఐబీపీ-కోర్ వి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. సాధారణ ఉపయోగం కోసం అప్రూవల్ పొందిన చైనా తొలి కరోనా వైరస్ షాట్ ఇదే. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యాంగ్‌పై ఇప్పటికే సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్స్‌పెక్షన్  (సీసీడీఐ) దర్యాప్తు జరుపుతోంది.


More Telugu News