అత్యాచార బాలిక గర్భవిచ్ఛిత్తి ఆదేశాలను వెనక్కి తీసుకున్న సుప్రీంకోర్టు!

  • గర్భవిచ్ఛిత్తి తదనంతర పరిణామాలతో కుమార్తె ఆరోగ్యంపై ఆందోళనగా ఉందన్న‌ బాలిక తల్లిదండ్రులు
  • బాధితురాలి ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్న‌ సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం
  • ఈ నేప‌థ్యంలోనే బాలిక 30 వారాల గర్భ విచ్ఛిత్తి తీర్పును వెనక్కి తీసుకుంటున్నట్లు సుప్రీంకోర్టు వెల్ల‌డి
మ‌హారాష్ట్ర‌కు చెందిన చెందిన 14 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై గర్భం దాల్చిన విష‌యంలో ఇటీవ‌ల సుప్రీంకోర్టు కీల‌క తీర్పును వెల్ల‌డించింది. బాలిక 30 వారాల గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకునేందుకు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం అనుమతినిస్తూ ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఇందుకు సంబంధించిన ఆదేశాలను సుప్రీం వెనక్కి తీసుకుంది. గర్భ విచ్ఛిత్తి త‌ర్వాత జ‌రిగే పరిణామాల నేప‌థ్యంలో త‌మ‌ కుమార్తె ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్య‌క్తం చేస్తూ బాలిక తల్లిదండ్రులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్ల‌డం జ‌రిగింది. దీంతో బాలిక ఆరోగ్య‌ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇంత‌కుముందు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకుంటున్నట్లు ధ‌ర్మాస‌నం పేర్కొంది. 

ఇక‌ బాలిక అత్యాచారానికి గురై గర్భం దాల్చిన విష‌యాన్ని ఆల‌స్యంగా తెలుసుకున్న ఆమె త‌ల్లి బాలిక గ‌ర్భవిచ్ఛిత్తి కోసం బాంబే హైకోర్టును ఆశ్ర‌యించ‌డం జ‌రిగింది. అక్క‌డ వారికి నిరాశ ఎదురైంది. దాంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గ‌ర్భ‌విచ్ఛిత్తికి అనుమ‌తించింది. బాధితురాలికి సంపూర్ణ మద్దతు అందించేందుకు రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 142 కింద ఉన్న విస్తృత అధికారాల‌తో ఈ తీర్పును వెలువ‌రించింది. అలాగే ముంబైలోని సియాన్ ఆసుప‌త్రి బోర్డు నివేదికను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది.  

ఇక సాధారణంగా మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం ప్రత్యేక అవసరాలున్న వారు, వివాహిత మహిళలు, అత్యాచార బాధితులు 24 వారాల వరకు తమ గర్భాన్ని వైద్యుల సూచనల మేరకు విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఆ సమయం దాటితే త‌ప్ప‌కుండా న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.


More Telugu News