హరీశ్ రావు సవాల్‌కు రేవంత్ రెడ్డి తోక ముడిచారు: కేసీఆర్

  • ఖమ్మం పట్టణంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్డు షో 
  • బీఆర్ఎస్ హయాంలో ఎక్కడ చూసినా వరికోతలు కనిపిస్తే ఇప్పుడు కరెంట్ కోతలు ఉన్నాయన్న కేసీఆర్
  • చాయ్ హోటల్ వద్ద ఆగి... స్థానికుల సమస్యలు విన్న కేసీఆర్
హరీశ్ రావు రాజీనామా లేఖతో వచ్చి సవాల్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోకముడిచారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టును కట్టి మన గోదావరి నీళ్లను తరలించుకుపోయే కుట్ర చేస్తుంటే ముఖ్యమంత్రి నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఖమ్మం పట్టణంలో కేసీఆర్ రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మన పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఆశ ఎక్కువ అని, నా రాష్ట్రం... నా జిల్లా బాగుండాలని ఆరాటపడుతుంటారన్నారు. ఇంత ఎండను లెక్కచేయకుండా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారన్నారు.

బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో ఎక్కడ చూసినా వరికోతలు కనిపించేవని... ఇప్పుడు కరెంట్ కోతలు కనిపిస్తున్నాయని చమత్కరిస్తూ విమర్శించారు. మన పాలనలో ఓ దశలో తెలంగాణలో పంటలు పంజాబ్‌ను తలదన్నేస్థాయికి పోయాయని... ఆ సమయంలో కేంద్రం మన వడ్లను కొనుగోలు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ వారికి తెలంగాణ ఓట్లు కావాలి కానీ వారికి రైతు సమస్యలు పట్టవని ఆరోపించారు.

చాయ్ హోటల్ వద్ద ఆగిన కేసీఆర్

కేసీఆర్ ఖమ్మం రోడ్డు షోకు వెళుతున్న సమయంలో మార్గమధ్యంలో ఎల్లంపేట స్టేజ్ తండా వద్ద చిన్న హోటల్ వద్ద ఆగారు. అక్కడున్న వారు కేసీఆర్‌కు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. స్థానిక యువత కేసీఆర్‌తో సెల్ఫీలు దిగింది.


More Telugu News