మంత్రి పెద్దిరెడ్డి ఇలాకాలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ పై దాడికి యత్నం

  • ఎర్రాతివారిపల్లెలో ప్రచారానికి వెళ్లిన రామచంద్రయాదవ్
  • అభ్యంతరం చెప్పిన పెద్దిరెడ్డి బంధువు
  • మరో గ్రామంలో ప్రచారం చేస్తుండగా రామచంద్రయాదవ్ పై దౌర్జన్యం
  • రామచంద్రయాదవ్ భద్రతా సిబ్బంది వాహనాలను ధ్వంసం చేసిన వ్యక్తులు  
చిత్తూరు జిల్లా సదుం పోలీస్ స్టేషన్ వద్ద ఇవాళ ఉద్రిక్తత నెలకొంది. అసలేం జరిగిందంటే... మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో బీసీవైపీ (భారత చైతన్య యువజన పార్టీ) అధ్యక్షుడు రామచంద్రయాదవ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. 

సదుం మండలం ఎర్రాతివారిపల్లెలో రామచంద్రయాదవ్ ఎన్నికల ప్రచారం చేస్తుండగా, పెద్దిరెడ్డి బంధువు వేణుగోపాల్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. ఇది మంత్రి పెద్దిరెడ్డి గ్రామం అంటూ హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి బంధువర్గం, బీసీవై పార్టీ మద్దతుదారుల మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. 

అనంతరం, రామచంద్రయాదవ్ ఎర్రాతివారిపల్లెలో ప్రచారం ముగించుకుని మరో గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనపై కొందరు వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. వారిని మంత్రి పెద్దిరెడ్డి అనుచరులుగా భావిస్తున్నారు. ఈ దశలో పోలీసులు జోక్యం చేసుకుని రామచంద్రయాదవ్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

అయితే అక్కడికి కూడా చేరుకున్న వైసీపీ వర్గీయులు రామచంద్రయాదవ్ వాహనాలను ధ్వంసం చేశారు. రామచంద్రయాదవ్ వై ప్లస్ భద్రత కలిగి ఉన్నారు. వైసీపీ శ్రేణుల దాడుల్లో ఆయన భద్రతా సిబ్బందికి చెందిన వాహనాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు సదుం పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.


More Telugu News