ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారు: రఘునందన్ రావు

  • దుబ్బాక నియోజకవర్గంపై ప్రభాకర్ రెడ్డికి అవగాహన లేదన్న రఘునందన్ రావు
  • గల్లీలో లేని... ఢిల్లీలో లేని కారును గెలిపిస్తే మిగిలేది శూన్యమేనని హెచ్చరిక
  • రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్న బీజేపీ నేత
  • కేసీఆర్ నూరు అబద్దాలు ఆడితే... రేవంత్ రెడ్డి వెయ్యి ఆడేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
లోక్ సభ ఎన్నికల తర్వాత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని మెదక్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. సోమవారం ఆయన దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాలులో జరిగిన కిసాన్ మోర్చా సమ్మేళనంలో మాట్లాడుతూ... ఈ నియోజకవర్గంపై కొత్త ప్రభాకర్ రెడ్డికి అవగాహన లేదన్నారు. ఆయనకు డబ్బులు పెట్టి ఓట్లు కొనడం మాత్రమే తెలుసునని విమర్శించారు. ఆయనది ఓటర్లను బానిసలుగా చూసే కుసంస్కారమన్నారు. గల్లీలో లేని... ఢిల్లీలో లేని కారును గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమేనని హెచ్చరించారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారని... ప్రభుత్వం కొలువుదీరి అయిదు నెలలు గడుస్తున్నా హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ నూరు అబద్ధాలు ఆడితే... ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి అబద్ధాలు ఆడేందుకు సిద్దంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ హయాంలో రైతులు ఎరువుల కోసం తమ చెప్పులను లైన్లో పెట్టిన విషయం మరిచిపోవద్దన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా ఎరువుల కొరత లేదన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను మోదీ నాయకత్వంలో పని చేసేందుకు పంపించాలని కోరారు.


More Telugu News