టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు నయా వైస్ కెప్టెన్?

  • హార్ధిక్ పాండ్యా స్థానంలో రిషబ్ పంత్‌కు వైస్ కెప్టెన్సీ అవకాశం!
  • సంచలన కథనాన్ని పబ్లిష్ చేసిన ‘క్రిక్‌బజ్’
  • ఐపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగా పంత్‌కు ఎక్కువ అవకాశాలున్నాయని విశ్లేషణ
టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోయే భారత జట్టు ఎంపికపై చర్చ, ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో ఆసక్తికర ఊహాగానం తెరపైకి వచ్చింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశాలున్నాయని క్రికెట్ అప్‌డేట్స్ అందించే ‘క్రిక్‌బజ్’ వెబ్‌సైట్ పేర్కొంది. డిసెంబరు 2022లో కారు ప్రమాదానికి గురయి కొంతకాలం క్రికెట్‌కు దూరంగా ఉన్న పంత్.. ఐపీఎల్ ద్వారా అద్భుతంగా పునరాగమనం చేశాడు. ఇదే సమయంలో హార్దిక్ పాండ్యా బ్యాటర్‌గా, బౌలర్‌గా ఆశించిన స్థాయిలో రాణించలేక ఐపీఎల్‌లో ఆపసోపాలు పడుతున్నాడు. కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్ జట్టుని నడిపించే విషయంలో కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కాబట్టి ఆటగాళ్ల ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే వైఎస్ కెప్టెన్‌గా పాండ్యా కంటే పంత్‌కే ఎక్కువ అవకాశం ఉందని పేర్కొంది.

‘‘మే 1న జరగనున్న సమావేశంలో బీసీసీఐ జాతీయ సెలెక్టర్లు పంత్‌ను భారత వైస్ కెప్టెన్‌గా తిరిగి నియమిస్తారని అంచనా వేస్తున్నాం. డిసెంబరు 2022లో కారు ప్రమాదానికి ముందు పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. జూన్ 2022లో దక్షిణాఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పంత్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఇక జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు పంత్ మొదటి ఆప్షనల్ వికెట్ కీపర్‌గా ఉంటాడు’’ అని క్రిక్‌బజ్ విశ్లేషించింది. 

మిగతా జట్టు ఎంపిక విషయానికి వస్తే రెండవ వికెట్ కీపర్ స్థానం కోసం సంజు శాంసన్, కేఎల్ రాహుల్ మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉందని, ప్రస్తుతం ఈ ఇద్దరు క్రికెటర్లు ఐపీఎల్‌లో తమ తమ ప్రాంచైజీల తరపున రాణిస్తున్నారని ప్రస్తావించింది. మరికొన్ని స్థానాల విషయంలో కూడా ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయని పేర్కొంది. 

మరోవైపు టాప్ ఆర్డర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ తప్పనిసరిగా ఉంటారని పేర్కొంది. మిడిల్ ఆర్డర్‌లో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉంటారని విశ్లేషించింది. శివమ్ దూబే లేదా రింకూ సింగ్‌లో ఒకరితో పాటు సంజూ శాంసన్‌ లేదా కేఎల్‌ రాహుల్‌లలో ఒకరు ఉంటారని పేర్కొంది. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవడం ఖాయమని క్రిక్‌బజ్ పేర్కొంది. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్పిన్నర్ యజువేంద్ర చాహల్ రాణిస్తున్నప్పటికీ మరోసారి నిరాశ తప్పకపోవచ్చని అంచనా వేసింది. రెండవ స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను తీసుకుంటే రవి బిష్ణోయ్‌తో పోల్చితే అక్షర్ పటేల్‌కు ఎక్కువ అవకాశాలు ఉంటాయని అంచనా వేసింది. 


More Telugu News