చిరంజీవి అన్నయ్య పిఠాపురం రారు... వచ్చినా చెల్లెల్ని ఓడించమని చెప్పరు: వంగా గీత

  • ఏపీలో హాట్ సీట్ గా పిఠాపురం నియోజకవర్గం
  • ఇక్కడ్నించి అసెంబ్లీకి పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్
  • పవన్ ప్రత్యర్థిగా వైసీపీ నుంచి ఎంపీ వంగా గీత పోటీ
  • ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు 
ఏపీలో ఎన్నికల్లో ఈసారి అందరి దృష్టి పిఠాపురంపై ఉందంటే అతిశయోక్తి కాదు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన జనసేనాని పవన్ కల్యాణ్, ఈసారి కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. ఆయనపై వైసీపీ అభ్యర్థిగా ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు.

వంగా గీత తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంగా గీత గారు మా పార్టీలోకి వస్తే బాగుంటుంది అని పవన్ కల్యాణ్ అనడంపై స్పందించారు. 

పవన్ కల్యాణ్ పెద్దగా ఆలోచించకుండా ఆ మాట అనుంటారని వంగా గీత పేర్కొన్నారు. "నేను వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాకముందు ఆయన ఆ మాట అనుంటే వేరేగా ఉండేది. కానీ ఇప్పుడు నేను వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఆయన కూడా ఒక పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అలా అనకూడదని కూడా పాపం ఆయనకు తెలియదు. దీన్ని నేను స్పోర్టివ్ గా తీసుకుంటున్నాను" అని వంగా గీత తెలిపారు. 

ఇక మే 5న మెగాస్టార్ చిరంజీవి పిఠాపురం వచ్చి పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేస్తారంటూ వస్తున్న కథనాలపైనా వంగా గీత స్పందించారు. "మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారు పిఠాపురం వస్తారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఆయన పిఠాపురం వచ్చినా వంగా గీతను ఓడించమని చెప్పరు. నాకు ఆ నమ్మకం ఉంది. 

ఎందుకంటే, గతంలో నేను ఆయనతో కలిసి పనిచేశాను. అంతకుముందు నేను ఏ క్యాడర్ లో ఉన్నా, అభిమానిగా ఆయనకు వద్దకు వెళ్లి రక్తదానం చేశాను. చిరంజీవి గారికి పవన్ కల్యాణ్ రక్తం పంచుకుపుట్టిన తమ్ముడు అయితే, చిరంజీవి గారి ఆశయాల కోసం రక్తం పంచి ఇచ్చిన చెల్లెల్ని నేను. 

చిరంజీవి గారు అనుకోకుండా పార్టీ పెట్టడం, ఆ పార్టీలోకి నేను వెళ్లడం జరిగాయి. 295 మందిలో 18 మంది నెగ్గితే, అందులో నేను ఒకరిని. పిఠాపురం ప్రజలు నన్ను గెలిపించి ఒక ఎమ్మెల్యేగా ఆయనకు అప్పగించారు. చిరంజీవి గారికి నా పనితీరు గురించి తెలుసు, నా మాటతీరు, నా పద్ధతి తెలుసు. ఆయన ద్వారానే నేను ఈ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అయ్యాను. ఆయనకు పేరు వచ్చే చాలా కార్యక్రమాలు చేయించాను. 

పిఠాపురం నియోజకవర్గంలో హోటల్ మేనేజ్ మెంట్ కాలేజి, పాదగయ క్షేత్రంలో వసతి సదుపాయాలు కల్పించగలిగాం అంటే చిరంజీవి గారి వల్లే. ఒకవేళ వస్తే తమ్ముడి తరఫున ప్రచారానికి వస్తారేమో కానీ, చెల్లెల్ని ఓడించమని మాత్రం చెప్పరు అని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది" అని వంగా గీత వివరించారు.


More Telugu News