కేసీఆర్ ప్రభుత్వం వనరులను దోచుకొని తెలంగాణను అప్పులపాలు చేసింది: భట్టివిక్రమార్క

  • కరెంట్ కోతలు లేకున్నప్పటికీ పవర్ పోతుందని దిగజారి మాట్లాడుతున్నారని మండిపాటు
  • కేసీఆర్ సిగ్గులేకుండా బస్సు యాత్రల పేరుతో తిరుగుతున్నారని విమర్శ
  • జనాభా దామాషా పద్ధతిన వనరుల పంపిణీ జరగాలని వ్యాఖ్య
కేసీఆర్ ప్రభుత్వం వనరులను దోచుకొని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ రోజురోజుకు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. కరెంట్ కోతలు లేకున్నప్పటికీ... ఎప్పటికీ పవర్ పోతుందని దిగజారి మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం సరికాదన్నారు. కేసీఆర్ ఇంకా సిగ్గులేకుండా బస్సు యాత్రల పేరుతో తిరుగుతున్నారన్నారు. తెలంగాణలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుందన్నారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిందన్నారు. దేశాన్ని దోపిడీ చేసిందని ఆరోపించారు. అన్ని వర్గాలకు వనరులు, సంపద దక్కాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. జనాభా దామాషా పద్ధతిలో వనరుల పంపిణీ జరగాలన్నారు. క్యాపిటలిస్టులకు బీజేపీ సర్కార్ దోచిపెడుతోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని, ఆస్తులను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఓయూలో కరెంట్, నీటి సమస్యపై స్పందన

ఓయూలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని భట్టివిక్రమార్క అన్నారు. విద్యుత్, తాగునీటి సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఓయూలో విద్యార్థులు ఖాళీ చేయాల్సిన అవసరం లేదన్నారు.


More Telugu News