ఈ ముఖ్యమంత్రి ఒక రంగుల పిచ్చోడు: డోన్ లో చంద్రబాబు వ్యాఖ్యలు

  • నంద్యాల జిల్లా డోన్ లో ప్రజాగళం సభ
  • రాష్ట్రంలో దొంగలు పడ్డారన్న చంద్రబాబు
  • ఆ దొంగలను పట్టే రోజు మే 13 అని వెల్లడి
  • మద్యంపై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టారని విమర్శలు
  • రుణభారాన్ని ప్రజల నెత్తిపై మోపిన దుర్మార్గుడు బుగ్గన అంటూ వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు నంద్యాల జిల్లా డోన్ లో ప్రజాగళం సభకు హాజరయ్యారు. డోన్ టీడీపీ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని, నంద్యాల లోక్ సభ స్థానం అభ్యర్థి బైరెడ్డి శబరిని గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని, ఈ దొంగలను పట్టే రోజు మే 13 అని వ్యాఖ్యానించారు. 

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై ధ్వజమెత్తారు. మద్యంపై వచ్చే ఆదాయం రూ.25 వేల కోట్లు తాకట్టు పెట్టారని, ఆ భారాన్ని ప్రజల నెత్తిపై మోపిన దుర్మార్గుడు ఈ బుగ్గన అని మండిపడ్డారు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు హరికథలు చెబుతున్నారని విమర్శించారు. వీళ్లు రాయలసీమకు ఏమైనా చేశారా, ఒక్క ప్రాజెక్టు కట్టారా? ఒక రోడ్డు వేశారా, ఒక పరిశ్రమ తెచ్చారా? వీళ్లకు ఎందుకు ఓట్లేయాలి? అని ప్రశ్నించారు. 

"ఈ సైకో జగన్ మోహన్ రెడ్డి రంగుల పిచ్చోడు. రంగులు వేసుకోవడానికి రూ.3 వేల కోట్లు ఖర్చు చేశాడు. ప్రజలు ఈ సైకోకు రంగు వేసి శాశ్వతంగా ఇంటికి పంపించాలి. ఇతడు బడికి, గుడికి, ఆఖరికి చెట్లకు రంగులు వేశాడు. ఎప్పుడైనా ఇలాంటి వాడ్ని చూశారా? సలహాదారుల కింద 100 మందిని పెట్టుకుని వాళ్లకు రూ.700 కోట్లు అప్పజెప్పాడు. ఇంకోపక్క, సాక్షి పత్రికకు వాణిజ్య ప్రకటనల కింద రూ.1000 కోట్లు ఇచ్చాడు. 

ఇప్పుడు అడుగుతున్నా... రాయలసీమ సాగునీటికి ఖర్చు పెట్టారా? తాగు నీటికి ఖర్చు పెట్టారా? ప్రజలకు గుక్కెడు నీళ్లు ఇవ్వని వీళ్ల అవసరం మనకుందా? ఇది ఎంత చేతగాని ప్రభుత్వం అంటే, ఆరోగ్యశ్రీకి రూ.1500 కోట్లు బకాయిలు పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టింది. 

ఐదేళ్లుగా రైతాంగాన్ని కుదేలు చేశారు. రైతులను తొక్కేశారు. నేను ఇక్కడ 90 శాతం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను... ఈ ప్రభుత్వం ఇస్తోందా? రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చి రైతు గౌరవంగా తిరిగే పరిస్థితి కల్పించిన పార్టీ టీడీపీ. కానీ ఈ ప్రభుత్వ పాలనలో పండ్ల తోటలు, కూరగాయల సాగు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాతను ఆదుకుంటాం. ప్రతి రైతుకు రూ.20 వేలు ఆర్థికసాయం అందిస్తాం" అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఇక్కడే ఎమ్మార్పీఎస్ వాళ్లు కూడా ఉన్నారు... మాదిగ కాలనీలకు వెళ్లండి... ఇంటింటికీ చెప్పండి... ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ, బీ, సీ, డీ వర్గీకరణ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ... మళ్లీ ఏ, బీ, సీ, డీ వర్గీకరణ చేయబోయేది ఎన్డీయే... మంద కృష్ణ మాదిగ కూడా రేపట్నించి వచ్చి ప్రచారం చేస్తాడు అని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు.


More Telugu News