చంద్రబాబుకు ఓటు వేస్తే అన్ని పథకాలు ఆగిపోతాయి.. గోవిందా గోవిందా!: జగన్

  • అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదన్న జగన్
  • ఇవి పేదలకు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలని వ్యాఖ్య
  • చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి మళ్లీ లేస్తుందన్న జగన్
వైసీపీకి ఓటు వేస్తేనే అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే అన్ని పథకాలు ఆగిపోతాయని చెప్పారు. 2014 ఎన్నికల్లో ఇదే కూటమి దొంగ హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు 'గోవిందా.. గోవిందా' అని అన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. అనకాపల్లి జిల్లా చోడవరంలోని కొత్తూరు జంక్షన్ సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని జగన్ తెలిపారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, రామోజీరావు, నోటాకు వచ్చినన్ని సీట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీ... వీళ్లందరితో మనం యుద్ధం చేయబోతున్నామని చెప్పారు. మరో రెండు వారాల్లో జరగబోతున్న కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు జగన్, చంద్రబాబు మధ్య కాదని... పేదలకు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలని చెప్పారు. ఈ ఎన్నికలు కేవలం ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేందుకు మాత్రమే కాదని... ఇవి పేదల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖి మళ్లీ లేస్తుందని... రక్తం తాగేందుకు తలుపు తడుతుందని చెప్పారు. 

మేనిఫెస్టోలోని ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబుకు మళ్లీ ఓటు ఎందుకు వేయాలని జగన్ ప్రశ్నించారు. పిల్లలకు మంచి చదువులు కావాలన్నా, మన వ్యవసాయం, ఆసుపత్రులు మెరుగుపడాలన్నా, వాలంటీర్లు మన ఇంటికి రావాలన్నా ఫ్యాన్ గుర్తు మీద బటన్ నొక్కాలని అన్నారు. 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు వైసీపీకి వస్తాయని... తగ్గేదే లేదని చెప్పారు. 

మంచి చేసిన ఫ్యాన్ ను ఇంట్లో ఉండాలని, చెడు చేసిన సైకిల్ ఇంటి బయట ఉండాలని జగన్ అన్నారు. తాగేసిన టీ గ్లాసు సింక్ లో ఉండాలని చెప్పారు. రాబోయే ఎన్నికలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని అన్నారు. ఇంట్లో వాళ్లతో కూర్చొని, చర్చించి ఓటేయాలని సూచించారు. ఓటు వేసేముందు ఆలోచించాలని చెప్పారు. 


More Telugu News