జగన్ కు భాస్కర్ అవార్డు ఇవ్వాలి: నారా లోకేశ్ ఎద్దేవా

  • సీఎంను తాకిన గులకరాయి చాలా స్పెషల్ అంటూ వ్యంగ్యం
  • అలాంటి రాళ్లతో రోడ్లు వేస్తే అద్భుతంగా ఉంటాయన్న యువనేత
  • మంగళగిరి మండలంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అద్భుతమైన నటుడని, సినిమాల్లో నటిస్తే ఆయనకు భాస్కర్ అవార్డు కచ్చితంగా వస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఈమేరకు ఆదివారం మంగళగిరి మండలంలోని నీరుకొండలో యువనేత రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. జగన్ నటన గురించి రాజమౌళికి ఫోన్ చేసి చెబుతానని, భాస్కర్ అవార్డు అందుకునే స్థాయిలో నటిస్తున్న జగన్ తో ఓ సినిమా చేయాలని కోరతానని అన్నాడు. దీంతో అక్కడున్న జనంలో నవ్వులు విరిసాయి. జగన్ ను తాకిన ఆ గులకరాయికి మ్యాజిక్ వచ్చని వ్యంగ్యంగా విమర్శించారు. తొలుత జగన్ ను తాకిన ఆ గులకరాయి అక్కడితో ఆగక పక్కనే ఉన్న వెల్లంపల్లికి తాకిందని, ముందు ఎడమ కంటికి తాకి ఆపై తలచుట్టూ తిరిగి కుడికన్నును కూడా గాయపరచడం మ్యాజిక్ కాక మరేమిటని ప్రశ్నించారు. ఈ ఘటనలో సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు బిల్డప్ ఇచ్చారంటూ లోకేశ్ సెటైరికల్ గా స్పందించారు. 

రచ్చబండలో ప్రజల సమస్యలు వింటూ..
నీరుకొండలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో యువనేత లోకేశ్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమకు కౌలు డబ్బులు సక్రమంగా అందడంలేదని రైతులు వాపోయారు. రాజధానిలో పింఛన్ డబ్బులు కూడా సకాలంలో అందడంలేదన్నారు. దీంతో లోకేశ్ స్పందిస్తూ.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధానిలో పేదలకిచ్చే రూ.5 వేల పింఛన్ పథకం కొనసాగిస్తామని, ఎప్పటికప్పుడు లబ్దిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న అసైన్డ్‌ రైతుల పింఛన్ ను వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేశ్ వివరించారు.


More Telugu News