మోదీ భారత్‌ను సృజనాత్మకత, నాయకత్వపటిమకు కేంద్రంగా నిలిపారు: భారత సంతతి ఐటీ నిపుణులు

  • అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో భవిష్యత్తుపై ఏఐ ప్రభావం అంశంపై సమావేశం
  • సమావేశంలో ప్రధాని సహా వివిధ అమెరికా టెక్ సంస్థల నిపుణులు పాల్గొన్న వైనం
  • భారత్‌కు మోదీ ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారన్న ఎన్నారైలు
  • పెట్టుబడులకు దేశాన్ని ఆకర్షణీయంగా మర్చారని వ్యాఖ్య
భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికాలోని భారత సంతతి ఐటీ రంగ నిపుణులు ప్రశంసలు కురిపించారు. సృజనాత్మకమైన, నాయకత్వ పటిమ ఉన్న దేశంగా భారత్‌ను ప్రపంచయవనికపై నిలిపారని కీర్తించారు. కృత్రిమ మేథ..మానవాళి భవిష్యత్తుపై ప్రభావాలు అనే అంశంపై స్టాన్‌పోర్డ్ యూనివర్సిటీలో ఇండియా డయాస్పొరా ఏఐ సమ్మిట్ పేరిట నిర్వహించిన సమావేశంలో మోదీతో పాటు భారత సంతతి ఐటీ రంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రధాని నాయకత్వ పటిమ, దూరదృష్టిని ప్రశ్నించారు. 

అంతర్జాతీయంగా భారత్‌పై గొప్ప సానుకూల అభిప్రాయం ఉందని ఇన్ఫోమేటికా సీఈఓ అమిత్ వాలియా అన్నారు. భారత్‌ను అభివృద్ధి, సృజనాత్మక, మానవవనరులకు ఆలవాలంగా ప్రపంచం చూస్తోందని అన్నారు. సృజనాత్మకత, నాయకత్వపటిమకు కేంద్రంగా భారత్‌ను మోదీ ప్రపంచపటంపై నిలిపారని వ్యాఖ్యానించారు. 

మోదీ ప్రభుత్వం భారతీయుల్లోని సామర్థ్యాలు, సృజనాత్మకతను వెలికితీయగలిగిందని ఎలాస్టిక్ సీఈఓ ఆశుతోష్ కులకర్ణి అన్నారు. మోదీ హయం అద్భుతమని మేఫీల్డ్ ఫండ్ మేనేజింగ్ పార్ట్‌నర్ నవీన్ ఛద్దా అన్నారు. ప్రధాని నాయకత్వం కారణంగా అమెరికా, భారత్ మధ్య దౌత్యబంధం మరింత బలపడిందని వ్యాఖ్యానించారు. సాంకేతికత సాయంతో ప్రధాని మోదీ దేశంలోని మౌలికవసతులను అభివృద్ధి చేయగలిగారని అన్నారు. ఇప్పటివరకూ ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చారని, ఆయన తన గ్యారెంటీలను మరింతగా పెంచాలని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సీఐఓ రోహిత్ జైన్ అన్నారు. భారత్‌లో కొత్త సంస్థలు నెలకొల్పేందుకు అనువైన వాతావరణం సృష్టించడంలో మోదీ కృతకృత్యులయ్యారని ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ఎమ్ఎఫ్‌జీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియా రాజన్ ప్రశంసించారు. మోదీ కృషి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంచర్ క్యాపిటలిస్టులు భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈ విషయంలో మోదీ అద్భుతమే చేశారని వ్యాఖ్యానించారు. 

ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ జనరేటివ్ ఏఐ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. డీప్ ఫేక్ సాంకేతికతలతో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో అందరం చూశామని వ్యాఖ్యానించారు. ఏఐపై ప్రపంచస్థాయి మార్గదర్శకాలను భారత్ రూపొందిస్తోందన్నారు.


More Telugu News