ఓడిపోతే కుర్చీకి ఎసరు వస్తుందని రేవంత్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు: కిషన్ రెడ్డి

  • లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమన్న కిషన్ రెడ్డి
  • పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి పీఠం కదులుతుందని జోస్యం
  • తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు ఎసరు పెట్టిందే కాంగ్రెస్ అని ఆగ్రహం
లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతే తన కుర్చీకి ఎసరు వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన చెందుతున్నారని, అందుకే అబద్ధాలు మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఆయన కాళ్ల కింద కుర్చీ కదులుతోందని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని... బీజేపీ తెలంగాణలో డబుల్ డిజిట్ సాధించబోతుందని జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి పీఠం కదలడం ఖాయమన్నారు.

ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తాము ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయమన్నారు. బీసీని ప్రధానిగా చేసిందే బీజేపీ అన్నారు. బీజేపీ నేతలు అనని మాటలను మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ ఎసరు పెట్టిందన్నారు. ఇన్నేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీసీని ఎప్పుడైనా ప్రధానిగా చేసిందా? అని ప్రశ్నించారు.


More Telugu News