నా ప్రత్యర్థి ప్రధాని మోదీ... అసోం ముఖ్యమంత్రికి ఎందుకు బాధ?: మల్లికార్జున ఖర్గే

  • వ్యక్తిగతంగా కలిసి మేనిఫెస్టోను వివరిస్తానని మోదీకి ఖర్గే లేఖ
  • మోదీని కలిసి మాట్లాడటం ఎందుకని ప్రశ్నించిన హిమంత బిశ్వ శర్మ
  • నేను ప్రధానితో మాట్లాడాననీ, ముఖ్యమంత్రితో కాదన్న ఖర్గే
తన ప్రత్యర్థి ప్రధాని మోదీ అయితే మధ్యలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఎందుకు బాధపడుతున్నారు? అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. శనివారం ఆయన అసోంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోకు సంబంధించి ఇటీవల ప్రధాని మోదీకి ఖర్గే లేఖ రాశారు. తాను వ్యక్తిగతంగా కలిసి మేనిఫెస్టోను వివరించేందుకు సిద్ధమని చెప్పారు. దీనిపై హిమంత బిశ్వశర్మ స్పందించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఇంగ్లీష్, హిందీలలో ఉందని... అలాంటప్పుడు మోదీని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడటం ఎందుకని ప్రశ్నించారు. ఖర్గే బీజేపీలో చేరాలనుకుంటే మాత్రం రావొచ్చునని.. తాను ఇంటికి వెళ్లి రక్షణగా ఉంటానని వ్యాఖ్యానించారు.

అసోం ఎన్నికల ప్రచారంలో హిమంత వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్ ఇచ్చారు. నేను ప్రధాని మోదీతో మాట్లాడానని... ముఖ్యమంత్రితో కాదన్నారు. తాను రాజ్యసభలో ప్రతిపక్ష నేతనని... లోక్ సభకూ ప్రాతినిధ్యం వహించానని గుర్తు చేశారు. పార్లమెంటరీ వ్యవహారాలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. అలాంటప్పుడు నా ప్రత్యర్థి మోదీ అవుతారని... ఆయనతో మాట్లాడుతానన్నారు. కానీ మధ్యలో హిమంత ఎందుకు బాధపడుతున్నారో చెప్పాలన్నారు. అసోంలో మా కాంగ్రెస్ వాళ్లను ఎదుర్కొని... ఆ తర్వాత నా గురించి మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.


More Telugu News