ముంబయి బౌలర్లను ఊచకోత కోసిన ఢిల్లీ బ్యాటర్లు... ఐపీఎల్ లో మరోసారి 250 ప్లస్ స్కోరు

  • ఐపీఎల్ తాజా సీజన్ లో ఆకాశమే హద్దుగా విజృంభిస్తున్న బ్యాట్స్ మెన్
  • ఇవాళ ముంబయి ఇండియన్స్ పై 20 ఓవర్లలో 4 వికెట్లకు 257 రన్స్ చేసిన ఢిల్లీ
  • 27 బంతుల్లో 84 పరుగులు చేసిన మెక్ గుర్క్
  • దూకుడుగా ఆడిన షాయ్ హోప్, ట్రిస్టాన్ స్టబ్స్
ఐపీఎల్-17వ సీజన్ లో పరుగులు వెల్లువెత్తుతున్నాయి. అత్యధిక శాతం బ్యాట్స్ మన్లదే రాజ్యం అని చెప్పాలి. ఇప్పటికే అనేక పర్యాయాలు 250 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. ఇవాళ ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ సైతం అదరగొట్టింది. 

ముంబయి బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తూ  ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 257 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్ లో ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపు ప్రతి మ్యాచ్ లోనూ వీరబాదుడు బాదుతున్న ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ఇవాళ కేవలం 27 బంతుల్లోనే 84 పరుగులు చేయడం విశేషం. 

మెక్ గుర్క్ స్కోరులో 11 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయంటే అతడి దెబ్బకు ముంబయి ఇండియన్స్ బౌలర్లు ఏ విధంగా విలవిల్లాడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అతడు 15 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టడం మరో హైలైట్. 

మెక్ గుర్క్ మాత్రమే కాదు, వన్ డౌన్ లో వచ్చిన షాయ్ హోప్ సైతం దూకుడుగా ఆడాడు. హోప్ 17 బంతుల్లో 5 సిక్సులతో 41 పరుగులు చేశాడు. అతడి స్కోరులో అన్నీ సిక్సులే బాదాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషబ్ పంత్ 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 29 పరుగులు చేయగా, ట్రిస్టాన్ స్టబ్స్ 25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 48 పరుగులు చేసిన అజేయంగా నిలిచాడు. యువ ఓపెనర్ అభిషేక్ పోరెల్ 36 పరుగులు చేశాడు. 

ముంబయి ఇండియన్స్ బౌలర్లలో ల్యూక్ వుడ్ 1, బుమ్రా 1, పియూష్ చావ్లా 1, మహ్మద్ నబి 1 వికెట్ తీశారు.


More Telugu News