ఆస్టియో ఆర్థరైటిస్ ను ముందే గుర్తించే ఏఐ బ్లడ్ టెస్ట్!
- ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదాన్ని ఎనిమిదేళ్లు ముందే గుర్తించవచ్చంటున్న శాస్త్రవేత్తలు
- 200 మంది మహిళలపై పదేళ్ల పాటు పరిశోధన
- రక్తంలో ఆరు ప్రత్యేక ప్రొటీన్ల స్థాయులను గుర్తించేలా బ్లడ్ టెస్ట్
ఇటీవలి కాలంలో చాలా మంది కీళ్ల నొప్పుల వ్యాధి ‘ఆస్టియో ఆర్థరైటిస్’ బారిన పడుతున్నారు. మారిన జీవన శైలి, ఆహారం, ఇతర అంశాలు దీనికి కారణమవుతున్నాయి. అయితే దీనిని ముందే గుర్తిస్తే.. తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా అయితే ప్రత్యేకమైన ఎక్స్ రే ల ద్వారా ‘ఆస్టియో ఆర్థరైటిస్’ వచ్చే అవకాశాన్ని కాస్త ముందుగా గుర్తించేందుకు వీలుంది. కానీ దానికన్నా ఏకంగా ఎనిమిదేళ్ల ముందే.. కీళ్ల నొప్పుల సమస్య ఇంకా మొదలుగాకముందే దాన్ని తెలుసుకోవడానికి వీలయ్యే బ్లడ్ టెస్ట్ విధానాన్ని శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు.
రక్తంలోని ప్రత్యేక ప్రొటీన్లను గుర్తించి..
రక్తంలోని ప్రత్యేక ప్రొటీన్లను గుర్తించి..
- ఆస్టియో ఆర్థరైటిస్ పై పరిశోధన చేపట్టిన శాస్త్రవేత్తలు.. 200 మంది మహిళల నుంచి పదేళ్ల పాటు తరచూ రక్తం శాంపిల్స్ తీసుకుని పరిశీలించారు. వారి వయసు, శరీర బరువు ఆధారంగా వివరాలను వేరుచేశారు.
- ఈ మహిళల్లో కొందరు ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య బారిన పడటంతో.. వారి రక్తంలోని ఏయే ప్రొటీన్ల స్థాయుల్లో తేడాలు వచ్చాయో తేల్చారు. ఈ ప్రొటీన్ల స్థాయులను కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో విశ్లేషించారు.
- చివరిగా ఆస్టియో ఆర్థరైటిస్ కు కారణమయ్యే ఆరు ప్రత్యేక ప్రొటీన్లను గుర్తించారు. రక్తంలో వీటి స్థాయులను గుర్తించేలా బ్లడ్ టెస్ట్ ను అభివృద్ధి చేశారు.
- అయితే పురుషుల్లోనూ విస్తృత పరిశోధన జరిపిన తర్వాత.. బ్లడ్ టెస్ట్ ను అందుబాటులోకి తెస్తామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
- ఆస్టియో ఆర్థరైటిస్ కు ఎలాంటి చికిత్స లేదని.. అయితే అది వచ్చే ప్రమాదాన్ని ముందే గుర్తిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన అమెరికాలోని నార్త్ కరొలినా డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్త వర్జినియా బేయర్స్ క్రాస్ తెలిపారు.
- ముఖ్యంగా మోకాళ్లపై ఒత్తిడి పడే వ్యాయామాలకు దూరంగా ఉండటం.. రన్నింగ్, జాగింగ్ వంటివి తగ్గించడం.. మెట్లు ఎక్కకపోవడం వంటి జాగ్రత్తలు చేపట్టవచ్చని వివరించారు.
- దీనివల్ల ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలు తక్కువగా ఉండేలా చేయవచ్చని వెల్లడించారు.