సీఎం జగన్ కు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

  • మీ పాలనలో బడుగు వర్గాల జీవన ప్రమాణాలు అధ్వానం అన్న షర్మిల 
  • రాజ్యాంగ హక్కులకు దిక్కులేని పరిస్థితి ఎదురవుతోందని వ్యాఖ్య  
  • సబ్ ప్లాన్ ను మంటగలిపారని విమర్శ 
  • ఎస్సీ ఎస్టీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు సీఎం జగన్ కు లేఖ రాశారు. మీ పాలనలో బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణాలు అధ్వానం అంటూ విమర్శించారు. రాజ్యాంగపరంగా దక్కాల్సిన హక్కులకు కూడా దిక్కులేని పరిస్థితి అని పేర్కొన్నారు. నిధులు దారి మళ్లించి, బడ్జెట్ పరంగా సబ్ ప్లాన్ ను మంటగలిపారని మండిపడ్డారు. 

మీరు అధికారంలోకి వచ్చేంతవరకు కొనసాగిన 28 పథకాలను, మీరు అధికారంలోకి రాగానే నిర్లక్ష్యంగా నిలిపివేశారని షర్మిల ఆరోపించారు. 

దళితులపై దాడులు, దాష్టీకాలు పెరుగుతున్నా పట్టనట్టే ఉన్నారని, దాడులు నివారించి దళితులను కాపాడే నిర్దిష్ట చర్యలు లేవని సీఎం జగన్ ను విమర్శించారు. దాడులు చేసేవారిలో ఎక్కువమంది మీ పార్టీకి చెందిన పెత్తందార్లేనని, ఎస్సీలకు మేలు చేయకపోగా కీడు చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జరిగిన అన్యాయాలకు వారిని క్షమాపణ కోరండి అని డిమాండ్ చేశారు. ఇకపై ఏ వివక్ష లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మాటివ్వండి... బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా కాంగ్రెస్ తరఫున ఇదే మా డిమాండ్ అని షర్మిల తన లేఖలో పేర్కొన్నారు.


More Telugu News